పురాతన ప్రజాస్వామ్యం

- ప్రజాస్వామ్య ఎన్నికలను పరిచయం చేసిన అమెరికా
వాషింగ్టన్, జనవరి 7: ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్య దేశమేదన్న అంశంపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. అయితే, ఎక్కువ మంది చరిత్రకారులు, రాజకీయ ఉద్ధండులు అమెరికానే అతి పురాతన ప్రజాస్వామ్య దేశంగా పరిగణిస్తారు. దీనికి పలు కారణాలను చెబుతారు. డెమోస్ (సాధారణ ప్రజలు), క్రటోస్ ( శక్తి/బలం) అనే రెండు గ్రీకు పదాల కలయికతో ‘డెమోక్రటిక్ (ప్రజాస్వామ్యం)’ అనే పదం వచ్చింది. అయితే అమెరికాకు స్వాతంత్య్రం వచ్చే కంటే మునుపే (అంటే 1,776 సంవత్సరానికి ముందే) గ్రేట్ బ్రిటన్ తదితర దేశాల్లో పార్లమెంటు వ్యవస్థలు ఉండేవి. అయితే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఎన్నికల ప్రక్రియకు నిర్మాణాత్మక కార్యచరణ అనేది ఆ దేశాల్లో ఉండేది కాదు. పేరుకు ప్రజాస్వామ్యమైనప్పటికీ, రాచరిక పరిపాలనే కేంద్రంగా ఉండేది. గ్రేట్ బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత అమెరికా రాజ్యాంగ నిర్మాతలు ప్రజాస్వామ్య దేశానికి ఉండాల్సిన భావనలను నిర్దేశించారు. భావవ్యక్తీకరణ హక్కు, సమావేశమయ్యే హక్కు వంటి ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు అగ్రతాంబూలం ఇచ్చారు. 1788-89లో అమెరికాలో తొలిసారిగా ప్రజాస్వామ్య బద్ధంగా నిర్మాణాత్మక ఎన్నికలు జరిగాయి. ప్రజల మద్దతుతో గెలిచిన చట్టసభ సభ్యులు జార్జ్ వాషింగ్టన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అప్పటివరకూ వారసత్వ, నియంతల పాలనలను చూసిన ప్రపంచానికి అమెరికా తొలిసారిగా ప్రజాస్వామ్య పాలనను పరిచయం చేసింది. అందుకే, అమెరికాను ప్రపంచంలోనే అతి పురాతన ప్రజాస్వామ్య దేశంగా, సజీవ ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణిస్తారు.
అమెరికా చట్ట సభలు
ప్రతినిధుల సభ
అమెరికా ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్) మన లోక్‌సభ వలె పని చేస్తుంది. అమెరికాలో ఉన్న 50 రాష్ర్టాల నుంచి 435 మంది సభ్యులు దీనికి ప్రాతినిధ్యం వహిస్తారు. వీరి పదవీకాలం రెండేండ్లు. ప్రతినిధుల సభకు రెండేండ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. లోక్‌సభ నియోజకవర్గాల మాదిరిగా అమెరికా కాంగ్రెస్ (ప్రతినిధుల సభ, సెనేట్.. రెండింటినీ కలిపి కాంగ్రెస్ అంటారు) జిల్లాలను ప్రకటిస్తుంది. జిల్లాల నుంచి ప్రతినిధుల సభకు అభ్యర్థులను ఎన్నుకొంటారు. వీరితో పాటు ఓటింగ్‌కు అధికారం లేని ఆరుగురు సభ్యులు ప్రతినిధుల సభలో ఉంటారు.
సెనేట్
ఇండియాలోని రాజ్యసభ లాగానే సెనేట్ రాష్ర్టాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సెనేట్‌లో రాష్ర్టాల తరఫున ప్రతినిధులు ఉంటారు. అయితే ప్రజలే నేరుగా వీరిని ఎన్నుకొంటారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రతినిధులు ఉంటారు. సెనేట్‌లో మొత్తం 100 మంది సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం ఆరేండ్లు. ప్రతి రెండేండ్లకు సెనేట్‌లో మూడో వంతు మంది పదవీ విరమణ పొందుతారు. కొత్తవారు ఎన్నికవుతారు. సెనేట్‌లో ఖాళీ అయ్యే సీట్లకు రెండేండ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.
అమెరికా క్యాపిటల్
భారత్‌లో ఉన్నట్టే అమెరికాలో కూడా ద్విసభా విధానం ఉంది. ఒకటి ప్రతినిధుల సభ. రెండోది సెనేట్. ఈ రెండింటిని కలిపి అమెరికా కాంగ్రెస్ అంటారు. వాషింగ్టన్‌లోని యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ భవనం(మన పార్లమెంటు భవనం లాగా)లో రెండు సభలు సమావేశం అవుతాయి. ఇది వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ అనే ప్రాంతంలో ఉన్నది. ఫెడరల్ చట్టాలను ఇక్కడే రూపొందిస్తారు. సెనేట్, ప్రతినిధుల సభ సభ్యులు కలిసి కాంగ్రెస్‌లో మొత్తం 541 మంది ఉంటారు. కాంగ్రెస్ ప్రతీ రెండేండ్లకొకసారి మారుతుంది. ప్రస్తుత కాంగ్రెస్ 117వది.
అధ్యక్షుడిని ఎలా ఎన్నుకొంటారంటే..
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓటమిని ఒప్పుకోనని ట్రంప్ పదేపదే చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన నిబంధనలను అమలు చేసిందని, ఇది చెల్లదంటూ కోర్టుకెక్కారు. అక్రమాలు జరిగినట్టు ఆధారాలు చూపలేదని కోర్టులు ఆయన మద్దతుదారులు వేసిన పిటిషన్లను కొట్టివేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికలు ఎందుకు వివాదాస్పదం అవుతాయి.. అధ్యక్షుడిని ఎలా ఎన్నుకొంటారో.. చూద్దాం..
ప్రైమరీస్
అమెరికాలో 50 రాష్ర్టాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఉంటారు. కొన్ని రాష్ర్టాల్లో పార్టీకి ఓ బృందం నాయకత్వం వహిస్తుంది. అయితే అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలనుకొనే వ్యక్తి పార్టీ నుంచి ఇతరుల మద్దతు కూడగట్టుకోవాలి.
నేషనల్ కన్వెన్షన్
రాష్ర్టాలవారీగా అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యాక.. రెండు పార్టీలు వేర్వేరుగా తమ జాతీయ స్థాయి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఇందుకోసం అభ్యర్థులు పార్టీలో అంతర్గతంగా ఇతర అభ్యర్థుల మద్దతు కోరతారు. లేదా పోటీ పడతారు. అధ్యక్ష అభ్యర్థిత్వం సాధించిన వ్యక్తి ఉపాధ్యక్ష పదవి కోసం అభ్యర్థిని ఎంపిక చేసుకొంటారు.
సాధారణ ఎన్నికలు
రాజకీయ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యాక అమెరికాలో సాధారణ ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఓటర్లు నేరుగా అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ఓటేయరు. వారి తరఫున 50 రాష్ర్టాల్లో 538 అభ్యర్థులు బరిలో ఉంటారు. వీరిని ఎలక్టోరల్ ఓట్లు అంటారు. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు (270 అంతకంటే ఎక్కువ) వస్తే ఆ పార్టీ అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు.
పాపులర్ ఓటు.. గెలుపు ధ్రువీకరణ
అమెరికాలో పాపులర్ ఓటు విధానం వల్ల ఫలితాల్లో గందరగోళం ఉంటుంది. ఒక రాష్ట్రంలో 50 ఎలక్టోరల్ ఓట్లు ఉంటే ఒక అభ్యర్థికి 26 మరొకరికి 24 ఓట్లు వచ్చినా.. 26 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకొన్న అభ్యర్థి ఖాతాలోకే అన్ని ఓట్లు వెళ్తాయి. అంతే కాకుండా ఓట్ల లెక్కింపు నిబంధనలను కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. రిపబ్లికన్ పార్టీ ప్రాతినిధ్యం ఉన్న రాష్ర్టాల్లో ఆ పార్టీకి అనుకూలంగా, డెమోక్రటిక్ పార్టీ ప్రాతినిధ్యం ఉన్న రాష్ర్టాల్లో ఆ పార్టీకి అనుకూలంగా నిబంధనలను రూపొందించుకొనే వీలుంది. ఆయా నిబంధనల ప్రకారమే రాష్ర్టాల్లోని ఎన్నికల అధికారులు అభ్యర్థుల గెలుపును ధ్రువీకరిస్తారు. చివరిగా కాంగ్రెస్( ప్రతినిధుల సభ, సెనేట్) సమావేశమై రాష్ర్టాలవారీగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించి విజేతను ధ్రువీకరిస్తుంది.
తాజావార్తలు
- 'గాలి సంపత్` విడుదల తేదీ ఖరారు
- రేగు పండు.. ఖనిజాలు మెండు..!
- దీదీపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన ఆటో.. ఇద్దరు దుర్మరణం
- కరెంట్ షాక్‌తో రైతు మృతి
- గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న నటుడు నవీన్ చంద్ర
- ఫేస్బుక్ నుంచి ఆటోమేటిగ్గా లాగౌట్.. ఎందుకు?
- మహా శివరాత్రి కానుకగా `జాతి రత్నాలు`
- ఆత్మనిర్భర్ భారత్‌లో యూపీ కీలకం : మోదీ
- ‘రైతు ట్రాక్టర్లకు డీజిల్ సరఫరా నిలిపివేయండి..’