బుధవారం 03 జూన్ 2020
International - May 20, 2020 , 12:16:15

ఆ మందులను అమెరికా సొంతంగా తయారు చేసుకుంటుందట

ఆ మందులను అమెరికా సొంతంగా తయారు చేసుకుంటుందట

వాషింగ్టన్: హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు కోసం భారత్ వంటి దేశాల మీద ఆధారపడడం లాంటి పరిస్థితి మరోసారి రాకూడదని అమెరికా భావిస్తున్నది. కోవిడ్-19 చికిత్సకు అవసరమయ్యే మందుల తయారీ తమ గడ్డ మీదనే జరగాలని కోరుకుంటున్నది. ఇందుకుగానూ సరికొత్తగా వెలసిన ఓ కంపెనీతో వైట్‌హౌస్ 81.2 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. విశ్వ మహమ్మారి అమెరికాను తాకినప్పుడు భారత్, చైనా సరఫరాల మీద అమెరికా ఆధారపడాల్సి వచ్చింది. ముఖ్యమైన మందులు, ముడిపదార్థాల కోసం చాలాకాలంగా విదేశీ ఉత్పత్తిదారులు, సరఫరా వ్యవస్థలపై ఆదారపడడం వల్ల అమెరికా ఆరోగ్య భద్రత, జాతీయ భద్రత తీవ్రమైన ప్రమాదంలో పడుతున్నాయని వైట్‌హౌస్ వాణిజ్య, ఉత్పాదన విధాన విభాగం డైరెక్టర్ పీటర్ నవారో చెప్పారు. కేంద్ర సంస్థలు అన్నీ కూడా తప్పనిసరిగా అమెరికా తయారీ మందులనే కొనుగోలు చేయాలని పరిపాలనా ఉత్తర్వులు జారీచేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎప్పటి నుంచో నవారో కోరుతున్నారు. కోవిడ్-19 మందుల తయారీ కాంట్రాక్టు ఫిలోవ్ కార్ప్ అనే ప్రైవేటు కంపెనీ దక్కించుకుంది. ఈ కంపెనీ కేవలం జనరిక్ డ్రగ్స్ మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ల తయారీతో దానికి సంబంధం లేదు. కరోనాకు నివారణగా హైడ్రాక్సీక్లోరోక్విన్ పనిచేస్తుందని ట్రంప్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ నుంచి పెద్దఎత్తున ఆ మందును ఆయన దిగుమతి చేసుకున్నారు. సరఫరా చేయకపోతే ప్రతీకార చర్యలకు దిగాల్సి వస్తుందని కూడా ఆయన బెదరించడం చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు భారత్ ఆయన కోరినంత మేర మందును ఎగుమతి చేయడంతో ఆయన ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు.


logo