శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 01, 2020 , 01:29:08

ఆధునిక మానవులంతా నియాండర్తల్స్ సంతతే!

ఆధునిక మానవులంతా నియాండర్తల్స్ సంతతే!
  • అమెరికా పరిశోధకుల ప్రకటన

న్యూజెర్సీ: ఆధునిక మానవులంతా నియాండర్తల్స్ సంతతేనని తాజా పరిశోధనలో తేలింది. నియాండర్తల్స్ జాతి యూరప్ ప్రాంతంలో నివసించి దాదాపు 40 వేల ఏండ్ల కిందట అంతరించింది. గతంలో జరిగిన పలు పరిశోధనల్లో నియాండర్తల్స్ సంతతి ఆఫ్రికా ఖండం మినహా ప్రపంచమంతా విస్తరించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆసియన్లు, అమెరికన్లు, యురోపియన్ల డీఎన్‌ఏల్లో కనీసం రెండు శాతం నియాండర్తల్స్ నుంచి వారసత్వంగా వచ్చిందని చెప్పారు. అయితే ఆఫ్రికన్లు కూడా నియాండర్తల్స్ సంతానమేనని అమెరికాలోని ప్రిన్‌స్టన్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా ప్రకటించారు. వీరి పరిశోధన వ్యాసం గురువారం సెల్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఆఫ్రికాకు చెందిన ఆధునిక మానవుల డీఎన్‌ఏలోనూ నియాండర్తల్స్ డీఎన్‌ఏల ఆనవాళ్లు కనిపించాయని ప్రొఫెసర్ జాషువా అకే చెప్పారు. ఆఫ్రికాకు చెందిన ఆదిమ మానవులు దాదాపు రెండు లక్షల ఏండ్ల కిందట యూరప్‌కు వలస వెళ్లారని.. అక్కడ కొన్నాళ్లపాటు నియాండర్తల్స్‌తో కలిసి జీవించారని.. ఆ తర్వాత తిరిగి వచ్చారని మా అధ్యయనంలో తేలింది. దీంతో ఆధునిక మానవులందరూ నియాండర్తల్స్ సంతతేనని స్పష్టమవుతున్నది అని ఆయన తెలిపారు. తమ అధ్యయనంతో మానవ చరిత్ర మరింత సంక్లిష్టంగా, ఆసక్తికరంగా మారిందని చెప్పారు.


logo