శుక్రవారం 15 జనవరి 2021
International - Nov 30, 2020 , 13:43:47

ఏలియ‌న్స్ మ‌ళ్లీ వ‌చ్చారు.. ఆ మోనోలిత్‌ను ఎత్తుకెళ్లారు!

ఏలియ‌న్స్ మ‌ళ్లీ వ‌చ్చారు.. ఆ మోనోలిత్‌ను ఎత్తుకెళ్లారు!

ఈ అనంత విశ్వంలో మ‌నం ఒంటరి వాళ్ల‌మా అన్న ప్ర‌శ్న‌కు ఇప్ప‌టికీ స్ప‌ష్టమైన స‌మాధానం లేదు. మ‌నం ఒంట‌రి వాళ్లం కాద‌ని.. విశ్వంలో ఎక్క‌డో ఓ చోట జీవం ఉండే ఉంటుంద‌ని కొంద‌రు వాదిస్తారు. తమ వాద‌న‌ను బ‌ల‌ప‌ర‌చ‌డం కోసం ఏలియ‌న్స్‌ను తెర‌పైకి తీసుకొస్తారు. మ‌రో గ్ర‌హం నుంచి మ‌న భూగ్ర‌హాన్ని చూసి వెళ్ల‌డానికి యూఎఫ్‌వోల‌లో ఏలియ‌న్స్ వ‌చ్చి వెళ్తున్నార‌న్న వార్త‌లు అప్పుడ‌ప్పుడూ చ‌దువుతూనే ఉంటాం క‌దా. అలాంటిదే ఇప్పుడు మ‌రో వార్త వైర‌ల్‌గా మారింది. అమెరికాలోని యూటా రాష్ట్రంలోని ఎడారిలో ఆ మ‌ధ్య మోనోలిత్‌గా అక్క‌డి వాళ్లు పిలుస్తున్న లోహంతో చేసిన ఓ పేద్ద నిర్మాణం క‌నిపించ‌డం చాలా మందిని ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఇది అస‌లు అక్క‌డికెలా వ‌చ్చిందో అంతుబ‌ట్ట‌క అధికారులు కూడా త‌ల ప‌ట్టుకున్నారు. ఆ ప్రాంతంలో దానిని చూసిన వాళ్లు ఇచ్చిన స‌మాచారం మేర‌కు న‌వంబ‌ర్ 18వ తేదీన యూటా ప‌బ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వాళ్లు హెలికాప్ట‌ర్‌లో అక్క‌డికి వెళ్ల‌గా ఆ నిర్మాణం క‌నిపించింది. 

అది అక్క‌డికెలా వ‌చ్చిందో త‌మ‌కు కూడా తెలియ‌ద‌ని అధికారులు చెప్ప‌డంతో ఇది ఏలియ‌న్స్ ప‌నే అని అక్క‌డి వాళ్లు చ‌ర్చించుకోవ‌డం మొద‌లుపెట్టారు. అయితే తాజాగా శ‌నివారం నుంచి ఆ మోనోలిత్ క‌నిపించ‌కుండా పోయింది. దీంతో ఏలియ‌న్స్ మ‌ళ్లీ వ‌చ్చి దానిని తీసుకెళ్లిపోయారంటూ మ‌రో చ‌ర్చ మొద‌లుపెట్టారు. ఇక్క‌డి డేటా సేక‌రించ‌డానికి దానిని అక్క‌డ ఉంచార‌ని, డేటా సేక‌ర‌ణ పూర్తి కాగానే తీసుకెళ్లిపోయార‌న్న వాద‌న ప్రారంభించారు. అయితే దీనిపై స్పందించ‌డానికి యూటా హైవే ప్యాట్రోల్ అధికారులు నిరాక‌రిస్తున్నారు. ఆ నిర్మాణం అయితే క‌నిపించ‌డం లేద‌ని, దానిని ఎవ‌రు, ఎప్పుడు తీసుకెళ్లారో మాత్రం తెలియ‌ద‌ని వాళ్లు చెబుతున్నారు. శుక్ర‌వారం రాత్రి ఆ నిర్మాణాన్ని ఎవ‌రో తీసుకెళ్లిపోయార‌ని బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. ఎవ‌రు ఏర్పాటు చేశారు.. ఎవ‌రు తీసుకెళ్లారో త‌మ‌కు కూడా తెలియ‌ద‌ని అధికారులు చెప్ప‌డంతో ఏలియ‌న్స్ వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరింది. ఇక్క‌డ మాయ‌మైపోయిన ఆ మోనోలిత్‌.. మ‌రో చోట క‌నిపిస్తుందేమో అని అక్క‌డి వాళ్లు చర్చించుకుంటున్నారు.