శుక్రవారం 15 జనవరి 2021
International - Jan 06, 2021 , 00:19:40

కష్టాల్లో ఆలీబాబా? జియోమీ మ్యూజిక్‌కు రాంరాం?

కష్టాల్లో ఆలీబాబా? జియోమీ మ్యూజిక్‌కు రాంరాం?

న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు జాక్‌ మా సారథ్యంలోని చైనీస్‌ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌ మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్‌ జియామీ మ్యూజిక్‌ను వచ్చే నెల నుంచి మూసివేయాలని నిర్ణయించినట్లు వినవస్తోంది. చైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో భారీగా ఎదగాలని అలీబాబా తొలుత భారీగా ప్రణాళికలు వేసింది. తాజా నిర్ణయంతో ఆలీబాబా ప్రణాళికలకు దీంతో చెక్‌ పడవచ్చని చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ వీబో పేర్కొంది కాగా...  కార్యకలాపాల సర్దుబాటులో భాగంగా జియామీ మ్యూజిక్‌ను ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

ఈ రంగంతో 12 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నట్లు ఆలీబాబా గ్రూప్‌ ప్రకటించింది. మ్యూజిక్‌ యాప్‌పై 2013లో అలీబాబా గ్రూప్‌ భారీ పెట్టుబడులను పెట్టడం ద్వారా చైనీస్‌ మ్యూజిక్‌ మార్కెట్‌లో ప్రవేశించింది. అయితే ఈ ప్రణాళికలు విజయవంతం కాకపోవడంతో వెనకడుగు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

చైనా మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ మార్కెట్‌లో జియామీ కేవలం రెండు శాతం మార్కెట్‌ వాటాను మాత్రమే సాధించగలిగింది.వెరసి కుగో, క్యూక్యూ, కువో, నెట్‌ఈజ్‌, క్లౌడ్‌ మ్యూజిక్‌ తదితర సంస్థల వెనుక జియామీ నిలిచిందని బీజింగ్‌ సంస్థ టాకింగ్‌ డేటా ఈ  సంగతులు వెల్లడించింది. 

కాగా... అలీబాబా గ్రూప్‌ అనుబంధ యాంట్‌ గ్రూప్‌పై గత డిసెంబర్‌ నెలలో యాంటీట్రస్ట్‌ చట్టంకింద చైనా నియంత్రణ సంస్థలు దర్యాప్తును చేపట్టిన విషయం తెలిసిందే. ఆలీబాబా గ్రూప్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ-కామర్స్‌ బిజినెస్‌ చేస్తూ ఆర్థిక సేవలు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ తదితర రంగాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంతకముందు జియామీ మ్యూజిక్‌ ప్రత్యర్థులైన నెట్‌ ఈజ్‌ క్లౌడ్‌ మ్యూజిక్‌ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. 2019 సెప్టెంబర్‌లో ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ మార్కెట్‌లో సుమారు రూ.5100 కోట్ల పెట్టుబడులు పెట్టింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.