శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 16, 2020 , 10:34:20

యోగా ఒకే..నో నమస్తే

యోగా ఒకే..నో నమస్తే

- అమెరికాలోని అలబామా రాష్ట్రం నిర్ణయం

- 27 ఏండ్ల తర్వాత యోగాపై నిషేధం ఎత్తివేత

వాషింగ్టన్‌: దాదాపు మూడు దశాబ్దాల క్రితం యోగాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు అమెరికాలోని అలబామా రాష్ట్రం సంసిద్ధత వ్యక్తంచేసింది. అయితే, భారతీయుల పలకరింపు పదం ‘నమస్తే’ వాడకంపై నిషేధం విధించింది. సాంప్రదాయిక సమూహాల ఒత్తిడి మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యోగాతోపాటు హిప్నాసిస్‌, ధ్యానంను నిషేధించాలని 1993లో అలబామా ఎడ్యుకేషన్‌ బోర్డు ఓటు వేసింది. ఈ నిబంధనను తొలగించాలంటూ డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుడు జెరెమీ గ్రే గత వారం అలబామా ప్రతినిధుల సభలో యోగా బిల్లు ప్రవేశపెట్టగా.. 84-17 ఓట్లతో పాసయింది. దాంతో దశాబ్దాల క్రితం యోగాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్లయింది. రాష్ట్ర సెనేట్‌లో గవర్నర్‌ కే ఇవే చేత ఆమోదం పొంది సంతకం చేస్తే అది చట్టంగా మారుతుంది. దీంతో 27 ఏండ్లుగా అన్ని పాఠశాలల్లో ఉన్న నిషేధం ముగియనున్నది. ఇదే సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు ప్రపంచ దేశాల నాయకులు గ్రీటింగ్‌ మాధ్యమంగా అవలంభిస్తున్న భారతీయు పలకరింపు పదం ‘నమస్తే’పై అలబామా రాష్ట్రం నిషేధం విధించింది. 

యోగాలోని అన్ని భంగిమలు, వ్యాయామాలు, స్ట్రెచింగ్‌ పద్ధతుల పేర్లు తప్పనిసరిగా ఆంగ్లంలోనే ఉండాలని, జపం చేయడం, మంత్రాలు పఠించడం, ముద్రలు, మండలాల వాడకంతోపాటు ‘నమస్తే’ శుభాకాంక్షలు తెలుపుడం వంటి వాటిని నిషేధిస్తున్నట్టు బిల్లులో పేర్కొన్నారు. గతంలో యోగా శిక్షకుడిగా పనిచేసిన డెమొక్రటిక్‌ సభ్యుడు జెరెమీ గ్రే.. యోగా బిల్లును అలబామా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన సందర్భంలో యోగాలో పాల్గొనడం స్వచ్ఛందంగా ఉంటుందని నొక్కిచెప్పారు. యోగాతో ఒత్తిడిని అధిగమిచడమే కాకుండా నిరాశ, ఆందోళనల నుంచి బయటపడొచ్చునని పేర్కొన్నారు. ఇలా ఉండగా, అలబామా పాఠశాలల్లో హిందూ మతం ప్రవేశపెట్టడమే లక్ష్యంగా యోగా బిల్లును తీసుకొస్తున్నారంటూ పలు క్రైస్తవ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 


logo