ఆదివారం 24 జనవరి 2021
International - Dec 16, 2020 , 14:33:42

చైనా వేగులను 2013లోనే గుర్తించిన ధోవ‌ల్‌!

చైనా వేగులను 2013లోనే గుర్తించిన ధోవ‌ల్‌!

న్యూఢిల్లీ:  వివిధ దేశాల‌కు చెందిన కాన్సులేట్లు, కార్పొరేట్ కంపెనీల్లోకి చైనా త‌న వేగుల‌ను పంపించి వాళ్ల ర‌హ‌స్య స‌మాచారాన్ని సేక‌రిస్తోంద‌ని ఈ మ‌ధ్య ది ఆస్ట్రేలియ‌న్ ప‌త్రిక బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలుసు క‌దా. క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) వ‌ర్క‌ర్లే వేటిలోకి వేగులుగా వెళ్తున్నార‌ని ఆ ప‌త్రిక వెల్ల‌డించింది. ఆ పార్టీకే చెందిన ఓ  స‌భ్యుడు 2016లో లీక్ చేసిన ప‌త్రాలే ఇప్పుడా ప‌త్రిక చేతికి చిక్కాయి. అయితే చైనా వేగుల విష‌యాన్ని ఇప్ప‌టి నేష‌న‌ల్ సెక్యూరిటీ అడ్వైజ‌ర్ అజిత్ ధోవ‌ల్ 2013లోనే గుర్తించిన‌ట్లు తాజాగా తేలింది. ఆ ఏడాది చైనీస్ ఇంటెలిజెన్స్‌: ఫ‌్రమ్ ఎ పార్టీ ఔట్‌పిట్ టు సైబ‌ర్ వారియ‌ర్స్ పేరుతో ధోవ‌ల్ ఓ సెమిన‌ల్ పేప‌ర్‌ను ప్ర‌చురించారు. అందులో చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ (ఎంఎస్ఎస్‌) ఆగ‌డాల‌ను ధోవ‌ల్ వివ‌రించారు. 

ధర్మశాల‌లోని ద‌లైలామా భ‌వ‌నంలోకి చొచ్చొకెళ్ల‌డం, పాకిస్థాన్‌లోని ఐఎస్ఐ సాయంతో ఈశాన్య తిరుగుబాటు గ్రూపుల‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డం, టిబెట్ స‌రిహ‌ద్దులో ఇండియ‌న్ ఆర్మీ క‌ద‌లిక‌ల‌పై క‌న్నేయ‌డంలాంటి చ‌ర్య‌ల‌కు ఎంఎస్ఎస్ పాల్ప‌డుతోంద‌ని ధోవ‌ల్ స్ప‌ష్టం చేశారు. గ‌త కొన్నేళ్లుగా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ త‌న ఇంటెలిజెన్స్ సామ‌ర్థ్యాన్ని వ్యూహాత్మ‌కంగా, సాంకేతికంగా చాలా మెరుగుప‌ర‌చుకున్న‌ద‌ని, ముఖ్యంగా ఏషియా ప‌సిఫిక్‌, సౌత్ ఏషియా, సెంట్ర‌ల్ ఏషియాల్లో పీఎల్ఏ ఇంటెలిజెన్స్ సామ‌ర్థ్యం చాలా మెరుగుప‌డింద‌ని ధోవ‌ల్ చెప్పారు. 

త‌మ దేశ ఆర్థిక‌, మిలిట‌రీ సామ‌ర్థ్యాల‌ను పెంచుకునేందుకు చాలా దూకుడుగా ఇత‌ర దేశాల సాంకేతిక డేటా, వ్య‌వ‌స్థ‌ల స‌మాచారాన్ని సేక‌రిస్తోంద‌ని వెల్ల‌డించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న చైనీయుల‌పైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతూ.. వారి నుంచే ఇంటెలిజెన్స్ స‌మాచారాన్ని సేక‌రిస్తూ, వారితోనే గూఢ‌చ‌ర్యం చేయిస్తోంద‌ని తెలిపారు. విదేశాల్లో ఇంటెలిజెన్స్ స‌మాచారం కోస‌మే 180 దేశాల్లో చైనీస్ భాష ఇన్‌స్టిట్యూట్‌లు నెల‌కొల్పిన‌ట్లు కూడా చెప్పారు. 


logo