గురువారం 03 డిసెంబర్ 2020
International - Oct 23, 2020 , 10:08:20

భార‌త్‌లో విప‌రీతంగా వాయు కాలుష్యం: ట్రంప్

భార‌త్‌లో విప‌రీతంగా వాయు కాలుష్యం: ట్రంప్

హైద‌రాబాద్‌: భార‌త్‌, చైనా, ర‌ష్యా దేశాల్లో వాయు నాణ్య‌త అత్యంత మురికిగా ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు.  అధ్య‌క్ష ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థి బైడెన్‌తో జ‌రిగిన రెండ‌వ డిబేట్‌లో ట్రంప్ ఈ కామెంట్ చేశారు. పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందం నుంచి త‌ప్పుకోవ‌డానికి కార‌ణాలు వెల్ల‌డించిన ట్రంప్‌.. త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకున్నారు.  చైనా దేశాన్ని గ‌మ‌నించండి, ఎంత రోత‌గా ఉందో..  ర‌ష్యాను చూడండి, ఇండియాను చూడండి.. ఆ దేశాల్లో వాయు నాణ్య‌త చెడిపోయిన‌ట్లు ట్రంప్ ఆరోపించారు.  దాని వ‌ల్లే పారిస్ ఒప్పందం నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలిపారు.  పారిస్ ఒప్పందానికి క‌ట్టుబ‌డి.. మిలియ‌న్ల సంఖ్య‌లో ఉద్యోగాల‌ను కోల్పోలేన‌ని, వేలాది కంపెనీల‌ను మూసివేయ‌లేమ‌ని ఆయ‌న అన్నారు.  

వాతావ‌ర‌ణ మార్పుల అంశంలో భార‌త్, చైనా లాంటి దేశాలు ఎటువంటి స‌హ‌కారం అందించ‌లేద‌ని ట్రంప్ అన్నారు.  కార్బ‌న్‌డైయాక్సైడ్ విడుదల చేస్తున్న దేశాల్లో భార‌త్ నాలుగ‌వ స్థానంలో ఉన్న‌ది. 2017లో భార‌త కార్బ‌న్ ఎమిష‌న్స్ 7 శాతంగా ఉన్న‌ది.  2015లో పారిస్ ఒప్పందాన్ని రూపొందించారు. దానికి బ‌రాక్ ఒబామా ఎంతో కృష్టి చేశారు.  అయితే 2017లో ఆ ఒప్పందం నుంచి అమెరికా త‌ప్పుకుంటున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు.  గ్లోబ‌ల్ వార్మింగ్‌ను రెండు డిగ్రీల సెల్సియ‌స్ త‌గ్గించేందుకు ఆ ఒప్పందాన్ని రూపొందించారు.  

డిబేట్ సంద‌ర్భంగా భార‌త దేశంలో ఉన్న వాయు నాణ్య‌త‌పై  ట్రంప్ చేసిన కామెంట్ ప‌ట్ల ట్విట్ట‌ర్‌లో కొంద‌రు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత క‌పిల్ సిబ‌ల్ ఈ అంశంపై ట్వీట్ చేశారు.  ప్ర‌ధాని మోదీ స్నేహితుడు ట్రంప్ భార‌త్ గురించి ఎటువంటి ప్ర‌క‌ట‌న చేశారో అర్థం చేసుకోవాల‌న్నారు.  ఇండియాలో కోవిడ్ మ‌ర‌ణాల‌ను ప్ర‌శ్నించార‌ని, భార‌తలో వాయు కాలుష్యం ఎక్కువే అన్నార‌ని, ఇండియా ప‌న్నులు కూడా ఎక్కువే వ‌సూల్ చేస్తుంద‌ని ట్రంప్ చేసిన కామెంట్ల‌ను క‌పిల్ సిబ‌ల్ త‌ప్పుప‌ట్టారు.