శనివారం 29 ఫిబ్రవరి 2020
కశ్మీర్‌ ఎలా ఉందో?

కశ్మీర్‌ ఎలా ఉందో?

Feb 14, 2020 , 03:21:52
PRINT
కశ్మీర్‌ ఎలా ఉందో?
  • ఆ ప్రాంతంలో మానవ హక్కులు ఎలా ఉన్నాయి?
  • ట్రంప్‌ పర్యటనకు ముందే పరిశీలించండి
  • అమెరికా విదేశాంగ మంత్రికి నలుగురు సెనెటర్ల లేఖ
  • భారత్‌లో మత స్వేచ్ఛ మాటేమిటి?

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 13: భారత్‌లో మతస్వేచ్ఛ, కశ్మీర్‌లో మానవ హక్కుల పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించాలని నలుగురు అమెరికన్‌ సెనెటర్లు ఆ దేశ విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. సీనియర్‌ సెనెటర్లయిన ఈ నలుగురు భారత్‌కు దీర్ఘకాలంగా అనుకూలంగా వ్యవహరిస్తున్న వారు కావటం విశేషం. విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోకు బుధవారం ఒక లేఖ రాస్తూ, భారత ప్రభుత్వం చాలా రోజుల నుంచి కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై నిషేధం విధించిందని తెలిపారు. ఓ ప్రజాస్వామిక దేశం ఇంత సుదీర్ఘకాలం నిషేధాజ్ఞలు విధించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఇంటర్నెట్‌పై నిషేధం విధించడం వల్ల దాదాపు 70 లక్షల మందికి తగిన వైద్య సదుపాయాలు అందటంలేదని, విద్య, వ్యాపారాలు దెబ్బతిన్నాయని తెలిపారు. గత ఏడాది ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 


దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఆర్టికల్‌ 370 రద్దు తమ అంతర్గత అంశమని భారత్‌ ప్రపంచ సమాజానికి తేల్చి చెప్పింది. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కున్న ప్రత్యేక హోదాను రద్దు చేసి ఆరు నెలలు గడిచింది, కానీ ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ను మాత్రం పునరుద్ధరించలేదు. కీలకమైన రాజకీయ నాయకులు సహా వందల సంఖ్యలో ప్రజలను ముందుజాగ్రత్త చర్యల పేరిట నిర్బంధంలో ఉంచారు’ అని నలుగురు సెనెటర్లు క్రిస్‌ వాన్‌ హోలెన్‌, టాడ్‌ యంగ్‌, రిచర్డ్‌ జే డర్బిన్‌, లిండ్సే ఓ గ్రాహం తమ లేఖలో పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టంను వారు తమ లేఖలో ప్రస్తావిస్తూ, భారత ప్రభుత్వం తమ దేశ లౌకిక స్వభావా నికి,మైనారిటీల హక్కులకు ముప్పువాటిల్లేట్టు చర్యలు తీసుకుందని ఆరోపించారు. మరోవైపు భారత పర్యటన కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ తెలిపారు. 


ట్రంప్‌కు నిరసన తెలుపుతాం: ఏచూరి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన సందర్భంగా నిరసన తెలుపుతామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. భారత ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకే ట్రంప్‌ వస్తున్నారన్న ఆయన.. భారత్‌లో ట్రంప్‌ ఎక్కడికి వెళ్తే అక్కడ వామపక్ష కార్యకర్తలు నిరసన తెలుపుతారని చెప్పారు.

logo