శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 24, 2020 , 03:07:19

ట్రంపేంద్ర బాహుబలి

ట్రంపేంద్ర బాహుబలి

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 23: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనపై తన ఆసక్తిని మరోసారి వ్యక్తపరిచారు. భారత్‌లోని నా గొప్ప స్నేహితులను కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నానని ఓ సందేశాన్ని శనివారం పోస్ట్‌ చేశారు. దీనికి ఓ వీడియోను కూడా జత చేశారు. ట్రంప్‌ సోమవారం నుంచి భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్‌ను ఉద్దేశిస్తూ కొన్ని వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంట్లో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ జియోరే బాహుబలి(హిందీలో)కి పేరడీ వీడియో కూడా ఉన్నది. బాహుబలి చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల్ని తీసుకొని ఓ ఔత్సాహిక నెటిజన్‌ ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో హీరో ప్రభాస్‌ ముఖాన్ని ట్రంప్‌ ముఖంతో మార్ఫ్‌ చేశారు. శివగామి పాత్ర స్థానంలో ప్రథమ మహిళ మెలానియాను చూపించారు. శివగామికి బాణాన్ని అందించే సన్నివేశంలో కట్టప్ప స్థానంలో ప్రధాని మోదీని తీర్చిదిద్దారు. అలాగే చిత్రంలో రాజ్య ప్రజల పిల్లల్ని హీరో తన భుజాలపై మోస్తున్న సన్నివేశంలో.. ట్రంప్‌ తన కూతురు ఇవాంకా, కొడుకు జూనియర్‌ డొనాల్డ్‌ను మోసినట్టు చూపించారు. అమెరికా-భారత్‌ సమైక్యత కోసం.. అంటూ పేర్కొన్న ఈ వీడియోను ‘సోల్‌' పేరుతో ఉన్న ఓ ట్విట్టర్‌ యూజర్‌ పోస్ట్‌ చేయగా.. ఆ వీడియోను ట్రంప్‌ రీట్వీట్‌ చేశారు. దీంతో సదరు వీడియో వైరల్‌గా మారింది. 81 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను వేలాది మంది లైక్‌ చేశారు.


logo