ఆదివారం 07 మార్చి 2021
International - Jan 24, 2021 , 02:09:51

జగతికి జలగండం

జగతికి జలగండం

  • కాలం చెల్లిన ఆనకట్టలతో ముంచుకొస్తున్న ప్రమాదం
  • ప్రపంచంలో ఉన్న డ్యాముల్లో చాలావరకు 1930-70 మధ్య నిర్మించినవే
  • దేశంలో 2050 నాటికి 150 ఏండ్లు పైబడనున్న 60కిపైగా జలాశయాలు
  • ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడి

న్యూయార్క్‌, జనవరి 23: భారత్‌లో 2025 నాటికి వెయ్యికి పైగా పెద్ద ఆనకట్టలు 50 ఏండ్లు పూర్తిచేసుకుంటాయని, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి డ్యాములతో పెను ముప్పు ముంచుకొస్తున్నదని ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. 2050 నాటికి భూమిపై చాలామంది ప్రజలు ఇలాంటి కాలం చెల్లిన వేలాది ఆనకట్టల దిగువ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారని తెలిపింది. ‘ఏజింగ్‌ వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: యాన్‌ ఎమర్జింగ్‌ గ్లోబల్‌ రిస్క్‌' పేరిట యూనైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 58,700 పెద్ద జలాశయాల్లో చాలా వరకు 1930-70 మధ్యన నిర్మించినవేనని, 50-100 ఏండ్లు మనగలిగేలా వీటిని డిజైన్‌ చేశారని నివేదిక వెల్లడించింది. 50 ఏండ్లకు చేరుకున్నాక, చాలా వరకు డ్యాముల్లో కాలం తీరిన లక్షణాలు (ఆనకట్టలు తెగటం, మరమ్మతుల వ్యయం పెరుగటం, సామర్థ్యం కోల్పోవటం) కనిపిస్తాయని తెలిపింది. 

ఆ నాలుగు దేశాల్లోనే 55 శాతం..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద ఆనకట్టల్లో దాదాపు 55 శాతం నాలుగు ఆసియా దేశాల్లోనే (భారత్‌, చైనా, జపాన్‌, దక్షిణకొరియా) ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. వీటిలో చాలా డ్యాములు నిర్మించి ఇప్పటికే 50 ఏండ్లు దాటిందని తెలిపింది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, తూర్పు యూరప్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని పేర్కొన్నది. అమెరికాలో 90,580 ఆనకట్టల సగటు వయసు 56 ఏండ్లు. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న డ్యాముల్లో 85 శాతం గడువు తీరినవే.  

పర్యావరణ మార్పుల ప్రభావం..

కాలం తీరిన ఆనకట్టలతో ముంచుకొస్తున్న ప్రమాదంపై ప్రపంచం దృష్టిసారించేందుకే ఈ నివేదికను రూపొందించినట్టు యూఎన్‌యూ డైరెక్టర్‌, నివేదిక సహ రచయిత వ్లాదిమిర్‌ స్మక్తిన్‌ తెలిపారు. వరదల ఉద్ధృతి పెరుగటం, పర్యావరణ మార్పుల కారణంగా డ్యామ్‌ల గడువు మీరటం వేగవంతం అవుతున్నదని చెప్పారు. ప్రపంచంలోని పెద్ద డ్యాముల్లో 93 శాతం 25 దేశాల్లోనే ఉన్నాయని మరో రచయిత దుమిండ పెరేరా వెల్లడించారు. ఆసియా, యూరప్‌, ఉత్తర అమెరికాలలో 20వ శతాబ్దం మధ్యకాలంలో పెద్ద ఆనకట్టల నిర్మాణం వేగం పుంజుకున్నదని వివరించారు. అదే ఆఫ్రికాలో 1980లలో ఎక్కువ నిర్మాణాలు జరిగాయని చెప్పారు. గత నాలుగు దశాబ్దాల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం మందగించిందని పేర్కొన్నారు. 50 శాతం నదీ విస్తరణ ప్రాంతం ఇప్పటికే ఆనకట్టల పరిధిలోకి రావడమే అందుకు కారణమని తెలిపారు. 

భారత్‌లో పరిస్థితేమిటి?

భారత్‌లో 1,115కిపైగా ఆనకట్టలు 2025 నాటికి 50 ఏండ్లకు చేరుకోనున్నాయి. 2050 నాటికి 4.250కిపైగా డ్యాములు నిర్మించి 50 ఏండ్లు దాటనున్నది. అలాగే 2050 నాటికి 64 పెద్ద ఆనకట్టలు 150 ఏండ్లు పూర్తిచేసుకోనున్నాయి. కేరళలోని ముళ్లపెరియార్‌ డ్యాము నిర్మించి వందేండ్లు దాటింది. ఈ డ్యామ్‌ తెగితే, 35 లక్షల మంది ప్రమాదంలో పడుతారు. భూకంప ప్రభావిత ప్రాంతంలో ఈ డ్యామ్‌ను నిర్మించారు. ఆనకట్ట డిజైన్‌లో లోపాలున్నాయి.

VIDEOS

logo