మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 03, 2020 , 22:06:30

జైలుపై ఇస్లామిక్ స్టేట్ దాడి : 29 మంది కాల్చివేత

జైలుపై ఇస్లామిక్ స్టేట్ దాడి : 29 మంది కాల్చివేత

జలాలాబాద్ : తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని ఒక జైలుపై ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దాడికి పాల్పడింది. యధేచ్చగా కాల్పులు జరుపడంతో దాదాపు 29 మంది దుర్మరణం పాలవగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు గంటసేపు కాల్పుల మోతతో జైలు ప్రాంగణం దద్దరిల్లింది. 

ప్రాదేశిక గవర్నర్ కార్యాలయానికి సమీపంలో అధిక భద్రత ఉన్న సెంట్రల్ జలాలాబాద్‌లోని సమీప నివాస భవనాల నుంచి విపరీతమైన కాల్పులు జరిగాయి. భద్రతా దళాలు జైలు గుండా వెళ్తుండగా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చేత దారుణ హత్యకు గురైన ఇద్దరు తాలిబాన్ ఖైదీల మృతదేహాలను వారు కనుగొన్నారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో రెండు మిలిటెంట్ వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఇటీవలికాలంలో పెరిగిపోయాయి. చనిపోయిన 29 మందిలో పౌరులు, ఖైదీలు, గార్డులు, ఆఫ్ఘన్ భద్రతా దళాలు ఉన్నట్లు ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అట్టౌల్లా ఖోగ్యాని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి దళం పేలుడు పదార్థాలతో నిండిన కారును జైలు ప్రధాన ద్వారం వరకు నడుపుకుంటూ వచ్చి బాంబు పేల్చడంతో ఈ దాడి జరిగింది. జైలు గార్డులపై కాల్పులు జరిపారు.

దాడి యొక్క ఉద్దేశ్యం వెంటనే తెలియరాలేదు. అయితే, అక్కడ ఉన్న 1,500 మంది ఖైదీలలో కొందరు కాల్పుల సమయంలో తప్పించుకున్నట్లుగా తెలుస్తున్నది. కాబూల్‌కు తూర్పున 115 కిలోమీటర్ల దూరంలోని నంగర్‌హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం భద్రతా దళాలు జైలును స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫవాద్ అమన్ తెలిపారు. ఇంతకుముందు తప్పించుకున్న 1,000 మంది ఖైదీలను తిరిగి పోలీసులు పట్టుకోగలిగారు. అమెరికా, నాటో దళాలు తాలిబాన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత.. ఆయా దళాలు వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించినప్పటికీ ఈ దాడి ఆఫ్ఘనిస్తాన్ కు ఎదురయ్యే సవాళ్లను హైలైట్ చేసింది.


logo