శనివారం 16 జనవరి 2021
International - Dec 20, 2020 , 19:13:31

కాందహార్ ప్రావిన్స్‌లో ఘర్షణ : 74 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతం

కాందహార్ ప్రావిన్స్‌లో ఘర్షణ : 74 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతం

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లోని  కాందహార్ ప్రావిన్స్‌లో ఆఫ్ఘన్ సాయుధ దళాలతో జరిగిన ఘర్షణల్లో 74 మంది తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారు. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. కాందహార్ ప్రావిన్స్‌లోని జెరియా, దండ్, పంజ్‌వే, అర్ఘండాబ్ జిల్లాల్లో మొత్తం 74 మంది తాలిబాన్లు మరణించగా.. మరో 15 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో రాసింది.

ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్న స్థానాలపై దాడి చేయడానికి సిద్ధమవుతున్న తాలిబాన్ ఉగ్రవాదులపై ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ దాడి చేసింది. పెద్ద సంఖ్యలో తాలిబాన్‌ ఉగ్రవాదులను హతం చేసి.. పెద్ద సంఖ్యలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాందహార్ ప్రావిన్స్‌లో ఇటీవలి రోజుల్లో ఘర్షణలు తీవ్రంగా నెలకొన్నాయి. ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాల ప్రకారం.. ఈ వారం ప్రారంభంలో నిరంతర సైనిక చర్యల మధ్య 82 మంది తాలిబాన్ ఉగ్రవాదులు ఈ ప్రావిన్స్‌లో మరణించారు. గత సెప్టెంబర్‌ నెలలో ఖతార్‌లో ప్రారంభమైన ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం, తాలిబాన్ల మధ్య శాంతి చర్చలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ.. మరోవైపు హింస, బాంబు పేలుళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.