సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 21, 2020 , 19:58:04

తల్లిదండ్రులను చంపిన తాలిబాన్లపై ప్రతీకారం తీర్చుకున్న బాలిక

తల్లిదండ్రులను చంపిన తాలిబాన్లపై ప్రతీకారం తీర్చుకున్న బాలిక

ఘజ్ని: తన తల్లిదండ్రులను దారుణంగా కాల్చిచంపిన తాలిబాన్లపై ఒక అప్ఘాన్‌ బాలిక ప్రతీకారం తీర్చుకున్నది. ఏకే 47 చేతబూని తాలిబాన్లపై గుండ్లవర్షం కురిపించింది. ఈ ఘటనలో ఇద్దరు తాలిబాన్‌ ఉగ్రవాదులు చనిపోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన మధ్య ప్రావిన్స్ ఘోర్ లోని ఒక గ్రామంలో జరిగింది.

ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు తాలిబాన్లు ఆ బాలిక తండ్రిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆయన భార్య ప్రతిఘటించడంతో ఇద్దర్నీ తాలిబాన్లు కాల్చిచంపారు. ఇంట్లో ఉండి ఘటనను కండ్లారా చూసిన వారి కూతురు కమర్‌గుల్‌.. అక్కడే పడివున్న ఏకే 47 తుపాకీని తీసుకుని తల్లిదండ్రులను కాల్చిన తాలిబాన్లపై కాల్చింది. అలాగే పక్కనే ఉన్నవారిపై కూడా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు తాలిబాన్‌ ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు గాయపడ్డారు. కమర్‌గుల్‌ కాల్పులు జరిపిన విషయాన్ని స్థానిక పోలీసు హెడ్ హబీబురాహ్మాన్ మాలెక్జాడా ధ్రువీకరించారు. ఆఫ్ఘన్ భద్రతా దళాలు గుల్‌తోపాటు ఆమె తమ్ముడిని సురక్షితమైన ప్రదేశానికి తరలించాయని ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి మొహమ్మద్ అరేఫ్ అబెర్ తెలిపారు. 

కమర్‌గుల్‌ వీరోచిత చర్య సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో గుల్‌ను ప్రశంసిస్తూ నెటిజెన్లు  కామెంట్లు పెడుతూ అభినందిస్తున్నారు. "తల్లిదండ్రులు కోలుకోలేని వారని తెలుసు, కానీ మీ పగ మీకు సాపేక్ష శాంతిని ఇస్తుంది" అని మొహమ్మద్ సలేహ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశాడు.

ప్రభుత్వానికి, భద్రతా దళాలకు ఇన్ఫార్మర్లు అని అనుమానించిన గ్రామస్తులను తాలిబాన్లు చంపేస్తున్నారు. ఇటీవలి నెలల్లో కాబూల్‌తో శాంతి చర్చలకు అంగీకరించినప్పటికీ ఉగ్రవాదులు భద్రతా దళాలపై దాడులను ముమ్మరం చేస్తున్నారు.


logo