శనివారం 29 ఫిబ్రవరి 2020
ఒకే రోజు 254 మంది!

ఒకే రోజు 254 మంది!

Feb 14, 2020 , 01:58:55
PRINT
ఒకే రోజు 254 మంది!

బీజింగ్‌: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) అంతకంతకూ విజృంభిస్తున్నది. ఈ వైరస్‌ బారినపడి బుధవారం ఒక్కరోజే 254 మంది మృత్యువాతపడ్డారు. ఒకరోజులో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. గతంలో నమోదైన అత్యధిక మరణాల కంటే ఇది రెట్టింపు. కరోనాతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,367కు చేరినట్లు చైనా జాతీయ వైద్య కమిషన్‌ వెల్లడించింది. అలాగే వైరస్‌ సోకిన వారి సంఖ్య 59,804కు పెరిగినట్లు తెలిపింది. వైరస్‌ను నిర్ధారించడానికి కొత్త పద్ధతిని అవలంబించడంతో కేసుల సంఖ్య అమాంతం పెరిగినట్లు అధికారులు చెప్పారు. ఇకపై వైరస్‌కు సంబంధించి ప్రాథమిక లక్షణాలు కనిపించినవారిని కూడా వైరస్‌ సోకినవారిగా పరిగణించనున్నారు. వైరస్‌ నిర్ధారణ అయిన వారితో సమానంగా వారికి కూడా చికిత్స అందించాలన్న ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వైరస్‌ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో వుహాన్‌లోని వివిధ యూనివర్సిటీల్లో ఉన్న వసతి గృహాలు, జిమ్‌లను కూడా దవాఖానలుగా మారుస్తున్నారు. దీంతో విదేశీ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. కాగా, జపాన్‌ తీరంలో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌' నౌకలో కరోనా వైరస్‌కు గురైన ఇద్దరు భారతీయుల ఆరోగ్యం మెరుగుపడుతున్నదని జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.  


తొమ్మిది రోజుల వరకు..

కరోనా వైరస్‌ తొమ్మిది రోజుల వరకు మనగలదని పరిశోధకులు వెల్లడించారు. ఇది సగటున 4-5 రోజులవరకు జీవించగలదని, అయితే తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ తేమ ఉన్న ప్రదేశాల్లో దాని జీవితకాలం మరింత పెరుగుతుందని జర్మనీలోని గ్రీఫ్స్‌వాల్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గుంటెర్‌ కాంఫ్‌ తెలిపారు. చేతులతోపాటు తరచూ తాకే వస్తువుల ద్వారా ఇది వ్యాప్తిచెందుతుందని పేర్కొన్నారు. logo