సోమవారం 01 జూన్ 2020
International - Apr 02, 2020 , 01:33:57

మూడోవంతు మరణాలు యూరప్‌లోనే

మూడోవంతు మరణాలు యూరప్‌లోనే

-ప్రపంచవ్యాప్తంగా 45వేల మరణాలు

-అందులో 30వేలకుపైగా యూరప్‌లోనే

-ఇటలీలో కరోనాకు తోడైన ఆకలి కేకలు

పారిస్‌: ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం యూరప్‌పై అత్యధికంగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ బారిన పడి దాదాపు 45వేల మంది మరణిస్తే.. అందులో 30,000 మందికిపైగా యూరప్‌లోనే మరణించారు. అంటే మొత్తం మరణాల్లో దాదాపు మూడోవంతు మరణాలు యూరప్‌లోనే సంభవించాయి. అవి కూడా అత్యధికంగా యూరప్‌లోని ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లోనే చోటుచేసుకున్నాయి. కరోనా వల్ల ఇటలీలో ఇప్పటి వరకు 13,155 మంది మరణించారంటే ఆ దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేగాక మరణాల పరంగా ప్రపంచవ్యాప్తంగా ఇటలీ తొలిస్థానంలో నిలిచింది. తర్వాత స్పెయిన్‌లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నది. 24 గంటల్లో 864 మంది మరణించడంతో స్పెయిన్‌లో మృతుల సంఖ్య 9,000 దాటింది. యూరప్‌లోని ప్రతి నాలుగు మరణాల్లో మూడు ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లోనే చోటుచేసుకుంటుండటం గమనార్హం. ఇక ఫ్రాన్స్‌లోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నది. కరోనా వల్ల 3,523 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇటలీలో కరోనా విజృంభిస్తుండగా.. ఇంకోవైపు ఆ దేశంలో ఆకలి రాజ్యమేలుతున్నది. ఆహారం కోసం ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. ఆకలిని తట్టుకోలేక కొన్ని చోట్ల సూపర్‌మార్కెట్లను దోచుకుంటున్నారు. దాదాపు 5లక్షలకుపైగా జనం ఆహారం అందించే ఆపన్నహస్తాల కోసం ఎదురుచూస్తున్నారు.


logo