సోమవారం 30 మార్చి 2020
International - Mar 12, 2020 , 14:46:10

ఆమె ఒంటరిగా కరోనాను జయించింది

ఆమె ఒంటరిగా  కరోనాను జయించింది

హైదరాబాద్‌ : కరోనా ఇంతింతై అంటూ విజృంభిస్తూ ప్రపంచాన్ని చుట్టుముడుతున్నది. కొన్నిదేశాల్లో ప్రభుత్వాలు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నాయి. విమానాలను నిలిపేస్తున్నారు. నిన్నటిదాకా నిబ్బరంగా ఉన్నవారు కూడా పరిస్థితి చేయిదాటి పోతున్నదని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ కావాల్సింది పిడికెడంత ధైర్యం. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరోమార్గం లేదు. ఒకవేళ వస్తేగిస్తే నిబ్బరంగా ఉండాలి. వైద్య చేయించుకోవాలి. కంగారు పడితే సమస్య ఇంకా తీవ్రరూపం దాలుస్తుంది తప్ప లాభం లేదు. ఈ సందర్భంగా మనం ఎలిజబెత్ ష్నీడర్ అనే మహిళ కరోనా  నుంచి ఎలా బయటపడిందీ తెలుసుకుంటే కొంత గుండెదిటవు కలుగుతుంది. ఎలిజబెత్ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్ర్రంలోని అతిపెద్ద నగరమైన సియాటిల్‌లో ఉంటారు. అమెరికాలో అత్యధిక కరోనా కేసులు వచ్చింది ఈ రాష్ట్రంలోనే. బయో ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసిన 37 సంవత్సరాల ఎలిజబెత్ తన కరోనా అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆమె ఇంటిదగ్గరే ఉండిపోయి తనకుతానే చికిత్స చేసుకున్నారు. ప్రజలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే తన కథను నలుగురితో పంచుకుంటున్నానని ఆమె చెప్పారు. ఆమె మాటల్లోనే..

ప్రజలకు నమ్మకం కల్పించేందుకు ఇదంతా చెప్తున్నాను.. అయితే కరోనా విషయంలో మరీ ఎక్కువ ధీమా పనికిరాదు.. సాపేక్షంగా నాకు వచ్చింది కొంత తేలికరకం జబ్బే. పెద్దవయసువారికి, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి కరోనా వస్తే చాలా ఇబ్బందే. అందుకే కరోనా వచ్చినవారెవరైనా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటివద్దే ఉండిపోవాలి. ఇతరుల నుంచి దూరంగా ఉండాలి. ఒకపార్టీకి వెళ్లివచ్చిన తర్వాత మూడురోజులకు ఫిబ్రవరి 25న నాకు ఫ్లూ తరహా జ్వరం వచ్చింది. ఆ పార్టీకి హాజరైనవారిలో ఓ ఐదుగురి వరకూ కరోనా సోకిందని తర్వాత తెలిసింది. నలతగా ఉండి ఆఫీసుకు పోవాలనిపించలేదు. కానీ బద్ధకంగానే వెళ్లాను. మధ్యాహ్నానికల్లా తలనొప్పి మొదలైంది. మెల్లగా జ్వరం పెరుగుతోంది. వొళ్లునొప్పులు కూడా వచ్చాయి. ఏదో తేడాగా ఉందనుకుని ఆఫీసు నుంచి డ్యూటీ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాను. సోఫాలో నడుం వాల్చాను. మెలకువ రాగానే టెంపరేచర్ చూస్తే 103 ఉంది. ఒకటే వణుకు. దానికి తోడు చలి. ఇంట్లో ఉన్న ఫ్లూ మందులు వేసుకున్నాను. ఓ ఫ్రెండ్ కు ఫోన్ చేసి అవసరమైతే ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధంగా ఉండమని చెప్పాను. కానీ రెండు మూడురోజుల్లో జ్వరం దిగివచ్చింది. దగ్గు, ఆయాసం లేనందువల్ల కరోనా పరీక్షకు వెళ్లలేదు. పార్టీలో పాల్గొని జబ్బుపడ్డ ఇతరులకు కూడా జ్వరాలు, చలి వచ్చాయి. దగ్గు, ఆయాసం లేదు. వారికీ వైద్యులు కరోనా పరీక్షలు జరుపలేదు. జ్వరం దాదాపుగా తగ్గిపోయిన తర్వాత సియాటిల్ ఫ్లూ స్టడీ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకుని ముక్కులోని ద్రవం శాంపిల్ పంపాను. కొద్దిరోజుల తర్వాత రీసెర్చ్ కోఆర్డినేటర్ నుంచి ఫోన్ వచ్చింది. నా శాంపిల్ పరీక్షలో కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి అవాక్కయ్యాను. లక్షణాలు కనిపించిన వారంరోజుల తర్వాత లేక లక్షణాలు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మూడు రోజులకు బయటకు రావచ్చని వైద్యాధికారులు సూచించారు. అంటే నాకు వచ్చింది కరోనా జ్వరమే. నా సొంత చికిత్సతో అది తగ్గిపోయింది. ఇదంతా తలచుకుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎవరికైనా లక్షణాలు కనిపించి జబ్బు మరీ తీవ్రస్థాయికి చేరుకోకుండా ఉంటే ఇంటిపట్టునే ఉండి ఫ్లూ చికిత్స తీసుకోండి. నీరు బాగా తాగాలి. సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలి. అలాచేస్తే జబ్బు నెమ్మదిస్తుంది. ఇతరులకు వ్యాపించకుండా చూడవచ్చు. నేను అదే చేశాను.                                 


logo