బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 15, 2020 , 13:44:17

కుప్పకూలిన పాక్ యుద్ధ విమానం

కుప్పకూలిన పాక్ యుద్ధ విమానం

ఇస్లామాబాద్: పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం మంగళవారం కుప్పకూలింది. సాధారణ శిక్షణలో భాగంగా టేకాఫ్ కాగా అటాక్‌లోని పిండిగెబ్ సమీపంలో అది కుప్పకూలింది. అయితే అందులోని పైలట్ సురక్షితంగా బయటపడినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. కాగా యుద్ధ విమానం కూలిన ఘటనపై బోర్డు ద్వారా దర్యాప్తు చేయనున్నట్లు పాకిస్థాన్ వాయుసేన (పీఏఎఫ్) చెప్పింది. ఈ ఏడాదిలో ఇలాంటి ఘటన ఐదవదని పేర్కొంది.

మార్చి 23 పెరేడ్‌కు రిహార్సిల్ చేస్తుండగా పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం ఇస్లామాబాద్‌కు సమీ‌పంలోని షకర్పారియన్ వద్ద కూలిపోయింది. ఈ ఘటనలో వింగ్ కమాండర్ నౌమాన్ అక్రమ్ చనిపోయారు. ఫిబ్రవరి 12‌న ఖైబర్ పఖ్తున్ఖ్వా‌‌లోని మర్దాన్ జిల్లాలోని తఖ్త్ భాయ్ సమీపంలో సాధారణ శిక్షణా కార్యక్రమంలో పీఏఎఫ్ ట్రైనర్ విమానం కూలిపోయింది. రెండు నెలల కన్నా తక్కువ వ్యవధిలో శిక్షణ విమానం కూలిన ఘటన ఇది మూడోవది. ఫిబ్రవరి నెలలోనే పాక్ వాయుసేనకు చెందిన మిరాజ్ యుద్ధ విమానం సాధారణ శిక్షలో భాగంగా లాహోర్-ముల్తాన్ మోటార్ వేపై కూలిపోయింది. ఈ రెండు సందర్భాల్లోనూ పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

దీనికి ముందు జనవరిలో పీఏఎఫ్‌కు చెందిన ఎఫ్‌టీ-7 యుద్ధ విమానం ట్రైనింగ్ మిషన్ సందర్భంగా మియాన్వాలి సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ హరిస్ బిన్ ఖలీద్, ఫ్లయింగ్ ఆఫీసర్ ఇబాదూర్ రెహ్మాన్ మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo