శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 20, 2020 , 15:46:19

ఫైజ‌ర్ వ్యాక్సిన్ తీసుకొని స్పృహ త‌ప్పింది.. వీడియో

ఫైజ‌ర్ వ్యాక్సిన్ తీసుకొని స్పృహ త‌ప్పింది.. వీడియో

వాషింగ్ట‌న్‌: అమెరికాలో ఫైజ‌ర్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ క‌నిపిస్తూనే ఉన్నాయి. తాజాగా టెన్నెస్సీలోని చాటానూగా హాస్పిట‌ల్‌లో ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ న‌ర్సు.. మీడియాలో మాట్లాడుతూ స్పృహ త‌ప్పి ప‌డిపోయింది. టిఫానీ డోవ‌ర్ అనే ఆ న‌ర్సు.. కెమెరా ముందు మాట్లాడుతున్న స‌మ‌యంలోనే త‌న‌కు కాస్త మ‌గ‌త‌గా ఉన్న‌దని చెప్పింది. ఆ వెంట‌నే స్పృహ త‌ప్పి కింద ప‌డ‌బోతున్న ఆమెను ప‌క్క‌నే ఉన్న డాక్ట‌ర్లు ప‌ట్టుకోవ‌డం వీడియోలో క‌నిపిస్తుంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి త‌న స్టాఫ్ అంతా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నార‌ని అంత‌కుముందే ఆమె మీడియాతో చెప్పింది. 

వ్యాక్సిన్ వ‌ల్ల కాదు

అయితే తాను ఇలా స్పృహ త‌ప్పి ప‌డిపోవ‌డం గ‌తంలోనూ జ‌రిగింద‌ని కోలుకున్న త‌ర్వాత ఆ న‌ర్సు చెప్పింది. త‌న త‌ల‌లో ఎప్పుడు నొప్పి వ‌చ్చినా.. ఇలా జ‌రుగుతుంద‌ని, అప్పుడు కూడా హ‌ఠాత్తుగా అలా జ‌రిగింద‌ని డోవ‌ర్ తెలిపింది. కానీ ఆ లోపే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వ్యాక్సిన్ వ‌ల్లే ఇలా జరిగిందంటూ అస‌లు విష‌యం తెలుసుకోకుండా కొంద‌రు యూజ‌ర్లు దుష్ప్ర‌చారం మొద‌లుపెట్టారు. నిజానికి ఇలా ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత స్పృహ త‌ప్ప‌డం స‌హ‌జ‌‌మేన‌ని అమెరికాకు చెందిన సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్ష‌న్ (సీడీసీ) వెల్ల‌డించింది. వ్యాక్సినేష‌న్ తాలూకు నొప్పి లేదా ఆందోళ‌న వ‌ల్ల ఇలా జ‌రుగుతుంద‌ని ప‌లువురు శాస్త్ర‌వేత్తలు చెబుతున్నారు.


logo