మంగళవారం 19 జనవరి 2021
International - Dec 11, 2020 , 01:08:49

చందమామపైకి రాజాచారి!

చందమామపైకి రాజాచారి!

  • హైదరాబాద్‌ మూలాలున్న వ్యక్తి అద్భుత ప్రతిభ
  • 2024లో చంద్రుడిపై కాలుమోపే అవకాశం

వాషింగ్టన్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2024లో చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపనున్నది. నాసా అర్టెమిస్‌ ప్రోగ్రామ్‌ పేరుతో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నది. ఇందుకోసం 18 మంది వ్యోమగాములను ఎంపికచేసింది. ఈ జాబితాలో హైదరాబాద్‌ మూలాలున్న రాజాచారి (41) చోటు దక్కించుకున్నారు. అంతే కాకుండా నాసా ప్రత్యేకంగా బేసిక్‌ ఆస్ట్రోనాట్‌ శిక్షణ ఇచ్చిన 11 మందిలో రాజాచారి ఒకరు కావడం విశేషం. 2017లో నాసా ఈ శిక్షణ ప్రారంభించింది. దీనికోసం 18వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా కేవలం 11 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ ఏడాది జనవరిలో శిక్షణ పూర్తి అయింది. ఈ 18 మందికి అడ్వాన్స్‌డ్‌ శిక్షణ ఇవ్వనున్నారు. రాజాచారి తండ్రి శ్రీనివాస్‌ హైదరాబాద్‌ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. అమెరికాలోని వాటర్‌లూలో నివసిస్తున్న రాజాచారి మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుం చి ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశారు. ప్రస్తు తం ఆయన 461 ఫ్లైట్‌ టెస్ట్‌ స్కాడ్రన్‌లో కమాండర్‌గా, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లోని ఎఫ్‌-35 ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ ఫోర్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.