మనీలా: మన పిల్లలకు మనకు ఇష్టమైన వారి పేర్లో, ఇంట్లో పెద్ద వాళ్ల పేర్లో పెట్టుకుంటాం. పేరులో ఏముంది అని అస్సలు లైట్ తీసుకోం. నిజానికి ఈ కాలంలో అయితే అసలు పిల్లలు ఇంకా పుట్టకముందే ఏ పేరు పెడితే బాగుంటుందో రీసెర్చ్‌లు చేసేవాళ్లూ ఉన్నారు. కానీ ఫిలిప్పీన్స్‌లో మాత్రం ఓ ఫ్యామిలీ ఉంది. ఇందులో అందరి పేర్లూ చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. మ్యాక్ అనే ఓ వ్యక్తి తన బాబుకు హెచ్‌టీఎంఎల్ అనే పేరు పెట్టుకున్నాడు. ఓ వెబ్ డిజైనర్ అయిన ఆ వ్యక్తి తన వృత్తి పట్ల తనకున్న ఇష్టంతో ఆ పేరు పెట్టుకోవడం విశేషం. ఇప్పుడీ పేరు ఇంటర్నెట్లో వైరల్ అయిపోయింది.
ఆ వ్యక్తి సోదరి బాబుకు పెట్టిన పేరును ఫేస్బుక్లో ప్రకటించింది. ఇంతకీ ఆమె పేరేంటో తెలుసా? సిన్సియర్లీ పాస్కల్స్. వెల్కమ్ టు ద వరల్డ్ హెచ్‌టీఎంఎల్ అని ఆమె కామెంట్ చేసింది. హెచ్‌టీఎంఎల్ పూర్తి పేరేంటో తెలుసా? హైపర్‌టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్ రాయో పాస్కల్. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన గంటల్లోనే వేల లైకులు, కామెంట్లు వచ్చాయి.
నిజానికి వీళ్లే కాదు ఈ ఫ్యామిలీలో అందరి పేర్లూ సాంప్రదాయ పేర్లకు విరుద్ధంగా ఉంటాయి. తండ్రి పేరు మ్యాక్ పాస్కల్. ఈయననే మాక్రోనీ 85 అని కూడా పిలుస్తారు. ఇక ఆయన మరో సోదరి పేరు స్పాగెట్టి 85. ఆమె పిల్లల పేర్లు చీజ్ పైమెంటో, పర్మేశన్ చీజ్. వాళ్లకు ఇద్దరు కజిన్లు ఉన్నారు. వాళ్ల పేర్లు డిజైన్, రీసెర్చ్. ఈ పేర్లన్నీ చూస్తుంటే ఈ ఫ్యామిలీకి ఫుడ్ అన్నా, టెక్నాలజీ అన్నా చాలా ఇష్టం అన్న విషయం సులువుగా అర్థమైపోతుంది.
ఈ మధ్యే పుట్టిన బాబుకు హెచ్‌టీఎంఎల్ అనే పేరు పెట్టడంపై కొంత మంది విమర్శలు చేసినా వాళ్లకు సిన్సియెర్లీ పాస్కల్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. పేరును బట్టి వెక్కిరించడం ఏంటో అర్థం కాదు. ఒకవేళ హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్‌ను స్కూల్లో చేర్చిన తర్వాత ఎవరైనా వెక్కిరించినా ఏమీ ఫర్వాలేదు. మేం చూసుకుంటాం. మీరు మరీ అంత బాధపడిపోకండి అని ఆమె బదులివ్వడం విశేషం.