గురువారం 04 జూన్ 2020
International - Apr 03, 2020 , 13:07:34

ఫిట్‌గా ఉన్నా వదలని కరోనా.. జర జాగ్రత్త

ఫిట్‌గా ఉన్నా వదలని కరోనా.. జర జాగ్రత్త

హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్‌ ఎవర్నీ వదలట్లేదు. వృద్ధులకే ఈ వైరస్‌ ప్రాణాంతకంగా మారిందని అందరూ అనుకుంటున్నారు. చిన్న పిల్లలు, శారీరక దారుఢ్యం ఉన్న వారికి కరోనా సోకిన వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, వారికి ఎలాంటి ముప్పు ఉండదని అందరూ భావిస్తున్నారు. కానీ ఫిట్‌గా ఉన్న వారిని కూడా కరోనా వైరస్‌ వదలట్లేదు అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. 

ఫ్లోరిడాకు చెందిన కోనార్డ్‌ బుకానన్‌(39) డిస్కో జాకీ. ఆయనకు భార్య నికోల్‌ బుకానన్‌, కూతురు స్కై ఉన్నారు. మార్చి మొదటి వారంలో కోనార్డ్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కరోనా టెస్టులు చేయించుకోవాలని భార్య చెప్పింది. తాను ఫిట్‌గానే ఉన్నాను. తనకెందుకు కరోనా సోకుతుందని కోనార్డ్‌ అన్నారు. మార్చి 22న అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించింది భార్య. ఇక అదే అతనికి చివరి రోజు. కోనార్డ్‌ కరోనాతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 

భర్త మరణంతో నికోల్‌ తీవ్ర ఆందోళనకు గురైంది. యువకుడినైనా, ఆరోగ్యకరంగా ఉన్నవారినైనా ఈ వైరస్‌ వదలట్లేదు అని ఆమె చెప్పింది. ప్రతి ఒక్కరూ ఈ వైరస్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. తాను శారీరకంగా ధృఢంగా ఉన్నాను. తనను ఏ వైరస్‌ ఏం చేయలేదు అని మాత్రం అనుకోవద్దు. శారీరకంగా ఫిట్‌గా ఉన్న తన భర్తను కరోనా వైరస్‌ కాటేసింది అని నికోల్‌ చెప్పింది. ఇప్పుడు తన జీవితం చీకటిమయం అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

నికోల్‌కు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. కాకపోతే ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. కూతురు స్కైకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. తాను తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని స్కై కన్నీరు పెట్టుకున్నారు. logo