మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 22:13:30

1970 నాటి మందు కరోనాతో ఊపిరితిత్తులకు నష్టం కలగకుండా కాపాడుతుందట!

1970 నాటి మందు కరోనాతో ఊపిరితిత్తులకు నష్టం కలగకుండా కాపాడుతుందట!

న్యూ ఢిల్లీ: కరోనా బారినపడ్డ వారిలో ప్రధానంగా కనిపించేది శ్వాసకోశ సమస్య. అయితే, దీన్ని తగ్గించే ఓ ఔషధాన్ని అమెరికా వైద్యులు గుర్తించారు. ఆర్‌ఎల్‌ఎఫ్‌-100 లేదా అవిప్టాడిల్ అనే ఔషధం కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లో తిష్టవేయకుండా అడ్డుకుని శ్వాసకోశ బాధలను తగ్గిస్తుందని కనుగొన్నారు. అలాగే, ఊపిరితిత్తులు పాడవకుండా కాపాడుతుందని తేల్చారు. మనీకంట్రోల్‌ నివేదిక ప్రకారం.. ఈ ఔషధాన్ని అత్యవసర ఉపయోగం కోసం యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదించింది.

అవిప్టాడిల్‌ను 1970లో తయారు చేశారు. ఇది సింథటిక్‌ హ్యుమన్‌ వాసోయాక్టివ్‌ ఇంటెస్టినల్‌ పాలీపెప్టైడ్‌(వీఐపీ)  ఔషధ ఫార్ములాను కలిగి ఉంటుంది. ఇది మానవ శరీరంలో రోగనిరోధక కణాలు, నరాల చివరల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరమంతా విడుదలవుతుంది కానీ ఊపిరితిత్తులలో కేంద్రీకృతమై న్యూరోట్రాన్స్‌మీటర్‌గా పనిచేస్తుంది. కండరాల కార్యకలాపాలను మెరుగుపర్చడానికి తోడ్పడుతుంది. 

అలాగే, గట్‌లో రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సైటోకిన్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి కొవిడ్‌ -19 రోగుల్లో శ్వాసకోశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతాయి. కాగా, కరోనా రోగులకు ఈ ఔషధాన్ని ఇవ్వగా శ్వాసకోశ సమస్యలు తగ్గిపోయాయని హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ హాస్పిటల్‌ నివేదించింది. ఈ డ్రగ్‌ను సాధారణంగా పురుషుల్లో అంగస్తంభన చికిత్సకు ఉపయోగిస్తారు. దీని పేటెంట్‌ హక్కులు ప్రస్తుతం  జెనీవాకు చెందిన ఫార్మా కంపెనీ రిలీఫ్ థెరప్యూటిక్స్ హోల్డింగ్స్ ఏజీ ఆర్‌ఎఫ్‌ఎల్‌బీ.ఎస్‌కు ఉన్నాయి.  


logo