ఆదివారం 17 జనవరి 2021
International - Dec 24, 2020 , 22:22:17

బ్రెగ్జిట్‌ ‘డీల్‌’కు ఓకే.. కానీ

బ్రెగ్జిట్‌ ‘డీల్‌’కు ఓకే.. కానీ

లండన్‌: దాదాపు నాలుగేండ్లుగా సాగుతున్న వివాదానికి తెర పడినట్లు కనిపిస్తున్నది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) బ్లాక్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగేందుకు ప్రతిపాదించిన ‘బ్రెగ్జిట్‌’ డీల్‌ ఖరారైందని బ్రిటన్‌లోని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈయూ నుంచి వైదొలిగేందుకు తుది గడువుకు ఏడు రోజుల ముందు బ్రెగ్జిట్‌ ఒప్పందానికి ఆమోదం లభించిందని ఆ వర్గాల కథనం. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. డీల్ ఈజ్ డన్ అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఇక నుంచి మన మనీపై, సరిహద్దులపై, చట్టాలపై, వాణిజ్యం, జలాల్లో చేపల వేట తదితర అంశాలపై నియంత్రణ సాధించామని బ్రిటన్‌ ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.  బ్రిటన్‌లోని కుటుంబాలకు, వ్యాపార వర్గాలకు ఈ డీల్‌ అద్భుతమైన వార్త. ఈయూతో జీరో టారిఫ్స్‌, జీరో కోటాలతో తొలి స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశామని ఆ వర్గాలు తెలిపాయి. 

రికార్డు సమయంలో గొప్ప ఒప్పందం సాధించుకోగలిగామని పేర్కొన్నాయి. ఈ ఒప్పందానికి బ్రిటన్‌ పార్లమెంట్‌, ఈయూ పార్లమెంట్‌ వచ్చే ఏడు రోజుల్లో ఆమోదముద్ర వేస్తేనే అమలులోకి వస్తుంది. ఎట్టకేలకు తమ మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లయన్ కూడా వ్యాఖ్యానించారు. ఇది ఎన్నో మలుపులు ఉన్న సుదీర్ఘ ప్రయాణమని, ఎట్టకేలకు ఇరు వర్గాలకు ఆమోదయోగ్య ఒప్పందం కుదరిందని తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.