గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 09, 2020 , 18:59:25

ట్రంప్‌కు షాక్‌.. కొవిడ్‌ టీకా ‘సేఫ్టీ ప్లెడ్జ్‌’పై తొమ్మిది ఫార్మా కంపెనీల సంతకం!

ట్రంప్‌కు షాక్‌.. కొవిడ్‌ టీకా ‘సేఫ్టీ ప్లెడ్జ్‌’పై తొమ్మిది ఫార్మా కంపెనీల సంతకం!

న్యూయార్క్‌: అక్టోబర్‌కల్లా వ్యాక్సిన్‌ సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన మరుసటిరోజే ఆయనకు చుక్కెదురైంది. తొమ్మిది బయోఫార్మా కంపెనీల ప్రతినిధులు కొవిడ్ -19 వ్యాక్సిన్ల అభివృద్ధిలో టీకాలు వేసిన వ్యక్తుల భద్రత, శ్రేయస్సును కొనసాగించే చారిత్రాత్మక ప్రతిజ్ఞపై(సేఫ్టీ ప్లెడ్జ్‌)  సంతకం చేశారు. ఆస్ట్రాజెనెకా, బయోఎంటెక్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ పీఎల్‌సీ, జాన్సన్ అండ్‌ జాన్సన్, మెర్క్ (యూఎస్‌, కెనడా వెలుపల ఎంఎస్‌డీ), మోడెర్నా, నోవావాక్స్, ఫైజర్, సనోఫీ సీఈవోలు ఈ ప్రతిజ్ఞపై సంతకం చేసినవారిలో ఉన్నారు.  

మహమ్మారిపై పోరాడటానికి చికిత్సలు, వ్యాక్సిన్ల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగా అనుమతి కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందే అక్టోబర్‌లోనే కొవిడ్ -19 కోసం వ్యాక్సిన్‌ను అమెరికా ఆమోదించవచ్చని ట్రంప్ తెలిపారు. కాగా, తాము ప్రజల భద్రతకే పెద్దపీట వేస్తామని, టీకాను క్షుణ్నంగా పరిశీలించకుండా ముందస్తు అనుమతి తీసుకోబోమని తొమ్మిది బయోఫార్మా కంపెనీలు సేఫ్టీ ప్లెడ్జ్‌పై సంతకం చేశాయి. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాత టీకా భద్రత, సమర్ధతను ప్రదర్శించిన అనంతరం మాత్రమే వీటి ఉత్పత్తికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటామని సేఫ్టీ ప్లెడ్జ్‌ సారాంశం.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo