సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 02:37:53

‘తల్లి’ దారుణంపై.. తల్లడిల్లిన జర్మనీ

‘తల్లి’ దారుణంపై.. తల్లడిల్లిన జర్మనీ

  • ఐదుగురు కన్నబిడ్డలను చంపిన మహిళ 
  • కన్నీరు పెడుతున్న జర్మనీ ప్రజానీకం 

బెర్లిన్‌: తన రక్త, మాంసాలను పంచుకొని పుట్టిన కన్న బిడ్డలను.. ఒకరిని కాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా ఐదుగురిని ఓ తల్లి కర్కశంగా కడతేర్చటంపై జర్మనీ కన్నీరు పెడుతున్నది. ముక్కుపచ్చలారని చిన్నారుల ఆత్మలకు శాంతి కలుగాలని వేలమంది ప్రజలు అశ్రునయనాలతో అంజలి ఘటిస్తున్నారు. జర్మనీలోని సోలింగెన్‌ నగరంలో 27 ఏండ్ల మహిళ 1నుంచి 8 ఏండ్ల వయసున్న తన ఐదుగురు బిడ్డలను గురువారం దారుణంగా హత్యచేసింది. అనంతరం రైలు ముందుకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. మెలీనా, లియోనీ, సోఫీ, టిమో, లుకా అనే చిన్నారులు తల్లి కర్కశత్వానికి బలయ్యారు. ఈ ఘటనపై స్థానికులతోపాటు దేశప్రజలంతా చలించిపోయారు. ఘటనా స్థలంలో శనివారం కొవ్వొత్తులు వెలిగించి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ చిన్నారులను హత్యచేయటానికి ముందు మహిళ తన 11 ఏండ్ల పెద్ద కుమారుడిని అమ్మమ్మ ఇంటికి పంపటంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ హత్యలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గాయాలతో బయటపడిన సదరు మహిళకు దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.


logo