శనివారం 16 జనవరి 2021
International - Jan 01, 2021 , 21:02:07

నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి.. విషవాయువు పీల్చి 8 మంది మృత్యువాత

నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి.. విషవాయువు పీల్చి 8 మంది మృత్యువాత

సారాజివో : బోస్నియా నైరుతి ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విష వాయువు ( కార్బన్‌ మోనాక్సైడ్‌ ) పీల్చి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. రాజధాని సారాజేవోకు నైరుతిగా 90 కిలోమీటర్ల దూరంలోని ట్రిబిటోవో గ్రామంలోని హాలిడే కాటేజీలో యువత నూతన సంవత్సర వేడుకలు ప్రారంభించారు. తీవ్ర చలి కారణంగా వెచ్చదనం కోసం పవర్‌ జనరేటర్‌ వినియోగించగా విష వాయువు లీకై పీల్చడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారని బోస్నియా, క్రొయేషియా మీడియా వెల్లడించింది. 

మృతి చెందిన వారిలో యువకులు, విద్యార్థులు ఉన్నారని పేర్కొంది.  హాలిడే కాటేజీలో పలువురు మృతి చెందినట్లు ఉదయం 10 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని స్థానిక పోలీసు అధికార ప్రతినిధి మార్టినా మెడిక్‌ తెలిపారు. పోసుజ్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామంలో ఘటన జరగటంతో మృతికి సంతాప సూచకంగా కాఫీ షాపులు, రెస్టారెంట్లు యాజమానులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. కార్బన్‌ మోనాక్సైడ్‌ వాసన, రంగు, రుచి లేని వాయువు. ఈ వాయువును పీల్చిన వారు వెంటనే అనారోగ్యానికి గురై మృతి చెందే అవకాశముంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.