బుధవారం 03 మార్చి 2021
International - Jan 15, 2021 , 07:31:55

ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురు మృతి

ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురు మృతి

జకార్తా : ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని, దీంతో పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయని.. ఏడుగురు మృతి చెందగా.. వందల సంఖ్యలో జనం గాయపడ్డారని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం తెలిపింది. భూకంప కేంద్రాన్ని మజేన్‌ నగరానికి ఈశాన్యంగా ఆరు కిలోమీటర్ల దూరంలో.. భూమిలోపల పది కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది. ఏడు సెకన్ల పాటు భూమికి కంపించడంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మజేనే నగరంలో నలుగురు మరణించగా.. 637 మంది గాయపడ్డారు. అలాగే పొరుగున ఉన్న మాముజు ప్రావిన్స్‌లోనూ భూంకంప ప్రభావం కనిపించింది. ఇక్కడ ముగ్గురు మరణించగా.. జనం గాయాలపాలయ్యారు.

శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట తర్వాత భూకంపం సంభవించడంతో వేలాది మంది ఇండ్ల నుంచి పరుగులు పెట్టారని, కనీసం 60 ఇళ్లకు నష్టం వాటిల్లిందని విపత్తు నిర్వహణ సంస్థ చెప్పింది. భూపంకం బలంగానే ఉందని, అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని చెప్పారు. వెస్ట్‌ సులవేసి గవర్నర్‌ కార్యాలయంతో పాటు పలు చోట్ల భవనాలు నేలమట్టమయ్యాయని, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. గురువారం సైతం ఇండోనేషియాలో 5.9తీవ్రతతో భూకంపం సంభవించింది. గత 24 గంటల్లో వరుస భూకంపాలు వచ్చాయని, విద్యుత్ సరఫరా తగ్గించినట్లు ఇండోనేషియా విపత్తు సంస్థ తెలిపింది. 2018లో, సులవేసి నగరంలో 6.2 తీవ్రతతో భూమి కంపించడంతో వచ్చిన సునామీ కారణంగా వేలాది మంది మరణించారు.

VIDEOS

logo