శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Jan 13, 2020 , 03:50:33

అమెరికా దళాలు లక్ష్యంగా

అమెరికా దళాలు లక్ష్యంగా
  • మళ్లీ రాకెట్‌ దాడులు
  • ఇరాక్‌లోని వైమానిక స్థావరంపై మోర్టార్‌ బాంబులు
  • నలుగురు ఇరాక్‌ వైమానిక దళ సభ్యులకు గాయాలు

సమర్రా(ఇరాక్‌), జనవరి 12: తమ టాప్‌ కమాండర్‌ ఖాసీం సులేమానీ మరణానికి కారణమైన అమెరికా దళాలే లక్ష్యంగా ఇరాన్‌ ప్రతీకార చర్యల్ని కొనసాగిస్తున్నది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌కు ఉత్తరాన అమెరికా సైనికులు ఉన్న ఓ ఇరాక్‌ వైమానిక స్థావరంపై ఆదివారం రాత్రి రాకెట్లతో విరుచుకు పడింది. దీంతో సుమారు ఏడు మోర్టార్‌ బాంబులు రన్‌వేపై పడ్డాయి. ఈ ఘటనలో ఇరాక్‌ వైమానిక దళానికి చెందిన నలుగురు సభ్యులు గాయపడ్డట్టు ఇరాక్‌ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ‘బాగ్దాద్‌కి ఉత్తరాన 80 కి.మీ. దూరంలో గల ఆల్‌ బలాద్‌ వైమానిక స్థావరంపై కత్యూశ రకానికి చెందిన ఎనిమిది రాకెట్లు దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు ఇరాక్‌ అధికారులతోపాటు మరో ఇద్దరు వైమానికదళ సిబ్బంది గాయపడ్డారు’ అని సైనిక వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. అయితే, ఈ ఘటనకు వెనకున్న కారకుల వివరాల్ని ఇరాక్‌ సైనిక వర్గాలు వెల్లడించలేదు. ఇరాక్‌కు చెందిన ఎఫ్‌ 16 యుద్ధ విమానాలకు ఈ స్థావరం పెట్టింది పేరు. అమెరికా వైమానిక దళానికి చెందిన మెజారిటీ సభ్యులు ఆల్‌ బలాద్‌ స్థావరంలో ఉండేవారని, అయితే, గత రెండు వారాలుగా అమెరికా, ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వాళ్లు ఈ స్థావరాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆల్‌ బలాద్‌ స్థావరంలో 15 మందికి మించి అమెరికా సైనికులు లేరని, అలాగే, ఒక సైనిక విమానం మాత్రమే ఉన్నట్టు తెలిపాయి.

ప్రభుత్వాలపై తగ్గుతున్న నమ్మకం

తెలుగు యూనివర్సిటీ: రాత్రికి రాత్రే దేశంలో రాజకీయ సమీకరణాలు మారిపోయే పరిస్థితుల వల్ల ప్రజల్లో నాయకుల పట్ల నమ్మకం సన్నగిల్లుతుందని సీనియర్‌ జర్నలిస్టు, ఇండియాటుడే గ్రూప్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మంథన్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ విద్యారణ్య పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు పార్టీ అధినాయకుడ్ని చూసి ఓటేయవద్దని, స్థానికంగా ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడిని గెలిపించుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ర్టాల్లో నేతలు తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పాట్లు పడుతూ అనేక తప్పులు చేస్తున్నారని, ఇది శుభ పరిణామం కాదని చెప్పారు. హైదరాబాద్‌ నగర వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నదని కొనియాడారు.


logo