బీజింగ్: చైనాలోని గాంగ్‌డాంగ్ ప్రావిన్సులో మళ్లీ కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో గాంగ్జూ నగర విమానాశ్రయానికి వచ్చే సుమారు 660 విమానాలను రద్దు చేశారు. మంగళవారం ఉదయం నాటికి సుమారు 50 శాతం విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గాంగ్జూ నగరంతో పాటు ఫోషన్ నగరంలోనూ కొత్తగా కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం స్టే ఎట్ హోమ్ ఆదేశాలు జారీ చేసింది. నెగటివ్ రిపోర్ట్ ఉన్నవాళ్లు మాత్రమే నగరం బయటకు వెళ్లాలంటూ ఆదేశించింది. మంగళవారం నుంచి చాన్చెంగ్ జిల్లా, నాన్హై జిల్లాల్లో ఉన్న ప్రజలంతా హోమ్ క్వారెంటైన్ కావాలంటూ ఆదేశించారు. సినిమాలు, జిమ్‌లు, బార్లను రద్దు చేశారు. ప్రయాణాలు చేయాలనుకునేవారు నెగటివ్ న్యూక్లియక్ యాసిడ్ టెస్ట్ పత్రాలను చూపించాలని ఫోషన్ నగరం ఆదేశాలు జారీ చేసింది. గాంగ్జూలో కొత్తగా 10 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఫోషన్‌లో రెండు కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.