సోమవారం 18 జనవరి 2021
International - Dec 11, 2020 , 09:42:52

తైవాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం

తైవాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం

తైపీ: తైవాన్‌లో నిన్న రాత్రి భూకంపం సంభవించింది. దేశంలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో గురువారం రాత్రి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.7గా నమోదయ్యిందని సెంట్రల్‌ వెదర్‌ బ్యూరో (సీడబ్ల్యూబీ) ప్రకటించింది. దీంతో భారీ భవనాలు సైతం ఊగిపోయాయని తెలిపింది. యలన్‌ కౌంటీ హాల్‌కు 27.2 కిలోమీటర్ల దూరంలోని ఈశాన్య తీరంలో 76.8 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని వెల్లడించింది. 

దీంతో ఉత్తర తైవాన్‌తోపాటు, ఈశాన్య, సెంట్రల్‌ తైవాన్‌లో భూమి కంపించిందని పేర్కొంది. తైపీ, న్యూ తైపీ, తైచుంగ్‌ పట్టణాలపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించింది. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, భూకంపం వల్ల తైపీ నగరం లోని ప్రభుత్వ సబ్ వే వ్యవస్థకు ఎలాంటి ప్రమాదం లేదని, అది సాధారణంగా పనిచేసిందని అధికారులు ప్రకటించారు. తైవాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. 2016లో దక్షిణ తైవాన్‌లో వచ్చిన భూకంపంతో వందమందికిపైగా మరణించగా, 1999లో రెండు వేలమంది ప్రాణాలు కోల్పోయారు.