ఆదివారం 31 మే 2020
International - Apr 08, 2020 , 12:07:37

ఐసోలేష‌న్‌లో ఉన్న తాత‌కి చిన్నారి లేఖ‌.. వైర‌ల్‌

ఐసోలేష‌న్‌లో ఉన్న తాత‌కి చిన్నారి లేఖ‌..  వైర‌ల్‌

ఐదేండ్ల చిన్నారి. 93 ఏండ్ల తాత‌. ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో ఉంటారు.  వారిద్దరికీ పెద్దగా పరిచయ కూడా లేదు. కానీ కొద్ది రోజులుగా ఆ తాత కనించట్లేదు.  తాతయ్య గురించి ఇంట్లో వాళ్లను అడిగింది.  క‌రోనా వైర‌స్ అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతున్న సంగ‌తి తెలిసిందే. తాతకు కరోనా సోకింది. ఆయన ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు అని చెప్పారు. దాంతో ఆయ‌న ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంది ఆ చిన్నారి. అంతే.. తాతకు ఓ లేఖ రాసింది. అందులో మంచి బొమ్మ కూడా వేసింది. ఇంతకీ ఆలేఖలో ఆ పాప ఏం రాసిందో చూద్దాం.

'హలో, నా పేరు కిరా. నాకు 5 సంవత్సరాలు. కరోనావైరస్ కారణంగా నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది. మీకు ఎలా ఉందో నేను తెలుసుకోవాల‌నుకుంటున్నాను. న‌న్ను మీరు గుర్తుప‌ట్ట‌డానికి నేను ఇంద్ర‌ధ‌న‌స్సు బొమ్మ గీసాను. వీలైతే మీ పొరిగింటి 9వ నెంబ‌ర్‌కు లేఖ రాయండి' అనే సందేశాన్ని పంపిన‌ది. ఈ లేఖ చూసిన పెద్దాయ‌న‌కు చాలా సంతోషం క‌లిగింది. ఎవ‌రూ లేని ఆయ‌నకు కిరా మాట‌లు ఉత్సాహాన్ని నింపాయి.

ఆయన కూడా లేఖ రాసి పంపించాడు. అందులో 'హ‌లో కిరా. నా క్షేమ సమాచారాన్ని అడిగినందుకు చాలా సంతోషంగాఉంది. నేను బాగున్నాను. త్వ‌ర‌గా కోలుకుంటాను. నా పేరు రాన్‌. నాకు 93 ఏండ్లు. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంది. దాన్ని అధిగ‌మించ‌డానికి మ‌న‌మంతా కృషి చేయాలి. ఇంద్ర‌ధ‌న‌స్సు డ్రాయింగ్ అద్భుతంగా ఉంది. దీనిని ప్ర‌జ‌లంతా చూడ‌డానికి కిటికీ వ‌ద్ద ఉంచుతున్నాను. నేను నీకు మ‌రొక‌సారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.' అని తాత తన లేఖలో రాసి పంపించాడు. ఈ పోస్ట్‌ను ఎల్ఎమ్ఎస్ అనే వినియోగ‌దారుడు ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. దీనికి ల‌క్ష‌కు పైగా లైకులు, 23,000 రీట్వీట్‌లు సంపాదించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. పోస్ట్ నెట్టింట్లో అంద‌రి మనసులు దోచుకున్నది.


logo