గురువారం 28 మే 2020
International - May 06, 2020 , 14:56:57

ఐదేళ్ల బుడ్డోడు హైవేపై కారులో బయలుదేరాడు.. ఎందుకో తెలుసా?

ఐదేళ్ల బుడ్డోడు హైవేపై కారులో బయలుదేరాడు.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్: అమెరికాలోని ఊటా రాష్ట్రంలో ఓ బుడతడు కారేసుకుని ఏకంగా హైవే మీదకే వచ్చాడు. పోలీసులు ఎవరో వికలాంగుడు నడుపుతున్నాడు అనుకుని కారు ఆపారు. తీరా చూస్తే డ్రైవింగ్ సీట్ వైపు వెళ్లిన పోలీసుకు ముందు ఏమీ కనిపించలేదు. తలుపు తెరిచి చూస్తే ఓ చిన్నోడు.. 'నీ వయసెంత బాబూ' అంటే 'ఐదు' అని సమాధానం. 'మరి కారు నడపడం ఎవరు నేర్పారు నాయనా' అని పోలీసులు కొంచెం వెక్కిరింతగానే అడిగారు. ఇంతకూ సంగతేంటంటే ఆ పిల్లోడు తనకు ఓ లంబోర్ఘిని కారు కొనివ్వ నని అన్నందుకు తల్లితో దెబ్బలాడాడట. తానే స్వయంగా కాలిఫోర్నియాకు వెళ్లి కారు కొనుక్కుందామని ఇంటి షెఢ్‌లో ఉన్న ఎస్‌యూవీ కారులో బయలుదేరాడు. హైవేపై నాలుగైదు కిలోమీటర్లు వెళ్లాడో లేదో పోలీసులకు ఏదో తేడా అనిపించి కారు ఆపారు. అడిగితే వయసు, బయలుదేరిన పని అర్తమైపోయి నోరు వెళ్లబెట్టారు. 'కారు కొనేందుకు బయలుదేరావా.. మరి డబ్బులున్నాయా' అంటే 'కొంచెం తక్కువ ఉన్నాయి' అని టక్కున సమాధానమిచ్చాడు. 'ఇంతకూ ఎంతున్నాయి నీ దగ్గర' అని అడిగితే 'ఓ మూడు డాలర్లు' అని చెప్పాడు. వాడి తెలివితేటలకు అబ్బురపడిని పోలీసులు తల్లిదండ్రుల్ని పిలిపించి బుడ్డోడిని అప్పగించారు. అదృష్టం ఏమంటే ప్రమాదం ఏదీ జరగలేదు.


logo