సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 05, 2020 , 19:03:44

48 మంది డాక్ట‌ర్లు రాజీనామా

48 మంది డాక్ట‌ర్లు రాజీనామా

ఇస్లామాబాద్ : క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టే చ‌ర్య‌ల్లో భాగంగా వైద్యులు ముందుండి పోరాటం చేస్తున్నారు. అయితే క‌రోనా నియంత్ర‌ణ‌కు పోరాటం చేస్తున్న డాక్ట‌ర్ల‌కు స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ.. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని బోధ‌నా ఆస్ప‌త్రుల్లో ప‌ని చేస్తున్న 48 మంది డాక్ట‌ర్లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. ఈ మేర‌కు డాక్ట‌ర్ల రాజీనామాల‌ను ఆమోదిస్తున్న‌ట్లు పంజాబ్ ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.  

క‌రోనా వార్డుల్లో ప‌ని చేస్తున్న డాక్ట‌ర్ల‌కు స‌రైన ర‌క్ష‌ణ సామాగ్రిని అందించ‌డంలో పాక్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైనందున‌.. త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు వైద్యులు స్ప‌ష్టం చేశారు. వైద్యుల ర‌క్ష‌ణ‌పై ప్ర‌భుత్వం క‌నిక‌రం చూప‌డం లేద‌ని మండిప‌డ్డారు. 

త‌మ‌కు ర‌క్ష‌ణ సామాగ్రి అందించాల‌ని, జీతాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌డం.. ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వానికి త‌ప్పుగా అనిపిస్తుంద‌ని డాక్ట‌ర్లు ధ్వ‌జ‌మెత్తారు. ఇటీవ‌లే ముజ‌ఫ‌రాబాద్ లో డాక్ట‌ర్లు నిర‌స‌న వ్య‌క్తం చేస్తే వారిని అరెస్టు చేసి న‌ర‌కం చూపించార‌ని పేర్కొన్నారు. నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం కూడా పాప‌మైంద‌న్నారు. 

ఐసోలేష‌న్ వార్డుల్లో ప‌ని చేస్తున్న వైద్యుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌క‌పోతే.. రాబోయే రోజుల్లో మ‌రింత మంది డాక్ట‌ర్లు రాజీనామా చేస్తార‌ని తాజాగా రాజీనామా చేసిన వైద్యులు హెచ్చ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 47 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ ప్రావిన్స్ లో అత్య‌ధికంగా 35 మంది డాక్ట‌ర్లు చ‌నిపోయారు. 

పాకిస్తాన్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,28,000 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 4,700 మంది చ‌నిపోయారు. మొత్తం ఐదు వేల మంది ఆరోగ్య సిబ్బందికి క‌రోనా సోక‌గా, ఇందులో 3 వేల మంది డాక్ట‌ర్లు, 600 మంది న‌ర్సులు ఉన్నారు. 


logo