మంగళవారం 02 జూన్ 2020
International - Mar 28, 2020 , 14:43:41

ఆఫ్రికాలో క‌రోనా.. 46 దేశాల్లో పాజిటివ్ కేసులు

ఆఫ్రికాలో క‌రోనా.. 46 దేశాల్లో పాజిటివ్ కేసులు

హైద‌రాబాద్‌:  ఆఫ్రికా ఖండంలోనూ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న‌ది.  ఆ ఖండంలోని ప‌లు దేశాలు ఇప్ప‌టికే లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. అనేక దేశాలు త‌మ స‌రిహ‌ద్దుల‌ను మూసివేశాయి.  46 దేశాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  కేసుల సంఖ్య ప్ర‌స్తుతం 3 వేల‌కు చేరుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఆఫ్రికా దేశాల్లో మొత్తం 83 మంది వైర‌స్ బారిన‌ప‌డి చ‌నిపోయారు.  కేసులు ఏమీ లేకున్నా.. సియ‌ర్రా లియోన్ లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. గునియా, ఎరిత్రియా దేశాలు స‌రిహ‌ద్దుల‌ను మూసివేశాయి. ద‌క్షిణాఫ్రికాలోనూ లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది.  నియ‌మాల‌ను ఉల్లంఘించిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు.  ఇథియోపియా ప‌లు ఆఫ్రికా దేశాల‌కు సాయం చేస్తున్న‌ది.  అలీబాబ్ సంస్థ పంపిన స‌ర‌కుల‌ను ఆ దేశం స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. 

లిస‌తో, జింబాబ్వే దేశాలు కూడా లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి.  కెన్యాలో మాత్రం క‌ర్ఫ్యూ విధించారు. ప‌లు చోట్ల లాఠీచార్జ్ జ‌రిగింది. మార్చి 26వ తేదీన సౌతాఫ్రికా లౌక్‌డౌన్ ప్ర‌క‌టించింది. ఆ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల ఇద్ద‌రు మృతిచెందారు. సొమాలియా, లిబియా, మాలీ దేశాల్లో కూడా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వెస్ట్ ఆఫ్రికాకు చెందిన ఐవ‌రీ కోస్ట్‌లో క‌రోనా కేసులు శ‌ర‌వేగంగా పెరుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జ‌లంతా ఐసోలేష‌న్‌లోకి వెళ్లాల‌ని నైజీరియా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 50 దాటింది. ఆఫ్రికాలో సుమారు 900 మిలియ‌న్ల మంది వైర‌స్ బారిన‌ప‌డే అవ‌కాశాలున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.


logo