ఆదివారం 12 జూలై 2020
International - Jun 16, 2020 , 10:16:48

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: కశ్మీర్‌లో ఉగ్రవాదులకు గత కొన్ని రోజులుగా భారత భద్రతా బలగాలు బుద్ధి చెబుతూనే ఉన్నాయి. తాజాగా, జమ్ముకశ్మీర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసులు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. షోపియాన్‌ జిల్లా తుర్క్‌వాంగమ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం అందగా, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. భద్రతా బలగాల మూమెంట్స్‌ను పసిగట్టిన ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే నేలకొరిగారు. 

  కాగా, సంఘటనా స్థలంలో రెండు ఏకే- 47 తుపాకులు, ఇన్సాస్‌ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం రాష్ట్రీయ రైఫిల్‌ స్థావరానికి కూతవేటు దూరంలో ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా, పది రోజుల్లో ముష్కరుల ఏరివేతకు భద్రతా బలగాలు జరిపిన నాలుగో ఆపరేషన్‌ ఇది.  ఈ నెలలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 19 మంది హతమయ్యారు. 



logo