బుధవారం 03 జూన్ 2020
International - Apr 25, 2020 , 14:30:44

అమెరికాలో మూడు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ సడలింపు

అమెరికాలో మూడు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ సడలింపు

హైదరాబాద్: అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 50 వేలు దాటిన నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఉపసంహరించే కార్యక్రమానికి కొన్ని రాష్ట్రాలు  శ్రీకారం చుట్టాయి. జార్జియా, ఓక్లహామా, అలాస్కా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉత్తర్వులను సడలించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తివేత తొందరపాటు అవుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. జార్జియా, ఓక్లహామాలో క్షౌరశాలలు, బ్యూటిక్ లు తెరిచేందుకు రిపబ్లికన్ గవర్నర్లు అనుమతులు మంజూరు చేసారు. కాగా అలాస్కాలో కొన్ని పరిమితులకు లోబడి అన్ని వ్యాపార కేంద్రాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. కొన్ని అలాస్కా మునిసిపాలిటీలు మాత్రం కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని సొంతంగా నిర్ణయించుకున్నాయి. మొత్తం మీద పరిమితంగానే అయినా లాక్ డౌన్ ఉపసంహరణ అనేది అమెరికాలో ఓ కొత్త మైలురాయిలా నిలుస్తున్నది. ఈ విషయమై అమెరికాలో తీవ్రమైన చర్చ జరుగుతున్నది. శుక్రవారం మీడియా సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక వ్యవస్థ మల్లీ పుంజుకుంటుందని ఆశావహంగా మాట్లాడారు. అయితే సామాజిక దూరం, ముఖాలకు మాస్కుల వంటి జాగ్రత్తలు కొనసాగించాల్సిందేనని ఆయన గుర్తు చేశారు. పారిశుధ్య రసాయనాలను తాగాలని లేదా ింజెక్షన్ ఇవ్వాలని తాను కేవలం సరదాకు మాత్రమే అన్నానని ట్రంప్ చెప్పారు. దీనిపై అంతర్జాతీయంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా ఆసియాలో చాలావరకు కరోనా విజృంభణ శాంతిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్‌కు జన్మస్థానంగా భావించే చైనాలో వరుసగా పదోరోజు ఒక్కం మరణం కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. కొత్తకేసులు కేవలం 12 మాత్రమే నమోదు అయ్యాయి. అందులో 11 బయటిదేశాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. చైనాలో ప్రస్తుతం ఆస్పత్రుల్లో కేవలం 838 మంది మాత్రమే కరోనాకు చికిత్స పొందుతున్నారు.


logo