Mexico explosion : మెక్సికో (Mexico) దేశంలోని ఓ సూపర్‌మార్కెట్ (Super market) లో శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు. హెర్మోసిల్లో (Hermosello) లోని వాల్డో సూపర్మార్కెట్లో ఈ పేలుడు జరిగింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పేలుడుకు గల స్పష్టమైన కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై ఆ ప్రాంత గవర్నర్ అల్ఫోన్సో మాట్లాడారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని, ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ ఎక్స్ ద్వారా దీనిపై స్పందించారు. ఈ ప్రమాద ఘటన తనను కలచివేసిందన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సోతో మాట్లాడినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం రెస్క్యూ సిబ్బందిని పంపించాలని అంతర్గత వ్యవహారాల కార్యదర్శి రోసా ఐసెలా రోడ్రిగ్జ్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు.