మంగళవారం 24 నవంబర్ 2020
International - Oct 31, 2020 , 07:07:16

22కు చేరిన ట‌ర్కీ భూకంప మృతులు

22కు చేరిన ట‌ర్కీ భూకంప మృతులు

అంకారా: ట‌ర్కీ, గ్రీస్‌ను భారీ భూకంపం కుదిపేసింది. ట‌ర్కీలో భూకంపం వ‌ల్ల మ‌రణించిన‌వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. నిన్న 14 మంది చ‌నిపోగా, ఇప్పుడు ఆ సంఖ్య 22కు చేరింది. ‌భూకంపం కార‌ణంగా 700 మందికిపైగా గాయ‌ప‌డ్డారు. టర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్‌ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని  అధికారులు గుర్తించారు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం సమోస్‌లోని గ్రీకు పట్టణం కార్లోవాసికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్ర‌త 7.0గా న‌మోద‌య్యింది. దీని ప్ర‌భావంతో సామోస్‌, ఏజియ‌న్ స‌ముద్రంలో చిన్న‌పాటి సునామీ వ‌చ్చింది. ట‌ర్కీలోని ఇజ్మిర్‌లో 20కిపైగా బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి. భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌తో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. శిథిలాల్లో చిక్కుకున్న బాధితుల కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మ‌రింత‌పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.

ఇజ్మిర్ తీర‌ప్రాంతంలోని స‌ముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. గ్రీస్ ద్వీపం సామోస్‌కు స‌మీపంలో 13 కి.మీ. లోతులో భూపంక కేంద్రం ఉన్న‌ద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మొల‌జీ ప్ర‌క‌టించింది. గతంలో ట‌ర్కీలో భారీగా భూకంపాలు సంభ‌వించాయి. ఈ ఏడాది జనవరిలో ఇలాజిగ్‌ ప్రావిన్సు‌లో సంభవించిన భూకంపంలో 30 మందికిపైగా మృతి చెందారు. 1600 మందికి పైగా గాయపడ్డారు. 1999లో ఇస్తాంబుల్‌ సమీపంలోని ఇజ్మిట్‌ నగరంలో వచ్చిన భూకంపంలో సుమారు 17 వేలమంది కన్నుమూశారు.