ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి.. ఎందుకు? ఏంచేస్తుంది..?

న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత మువ్వన్నెల జెండా నేటి నుంచి రెపరెపలాడనున్నది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి ఇవాళ మన దేశ జెండాను ఆవిష్కరించనున్నారు. భారత్తో పాటు తాత్కాలిక సభ్య దేశాలుగా నార్వే, కెన్యా, ఐర్లాండ్, మెక్సికోలు కూడా చేరుతున్నాయి. ఇప్పటికే తాత్కాలిక సభ్య దేశాలుగా ఎస్టోనియా, నైజర్, సెయింట్ విన్సెంట్, గైనడిన్స్, ట్యునీషియా, వియత్నంలు ఉండగా.. శాశ్వత సభ్య దేశాలుగా చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా దేశాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో భారత్ భద్రతా మండలికి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నది. అనంతరం 2022 లో మరోసారి ఒక నెలపాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతుంది. భద్రతా మండలిలో జెండా ఎగురవేసే సంప్రదాయాన్ని కజకిస్తాన్ 2018 సంవత్సరంలో ప్రారంభించింది.
అసలింతకీ ఏంటీ భద్రతా మండలి..?
అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితిని 1945 లో ఏర్పాటుచేసుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు థియోడార్ రూజ్వెల్ట్, బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్.. అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై చేసుకున్న శాంతి ఒప్పందానికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితిలో ముఖ్యంగా సర్వప్రతినిధి సభ, భద్రతా మండలి, సచివాలయం, ధర్మకర్తృత్వ మండలి, ఆర్థిక, సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం అనే ఆరు ప్రధాన అంగాలు ఉన్నాయి. ఇవే కాకుండా పలు అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. యుద్ధాలు జరగకుండా చూడటం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం, సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం వంటి ప్రధాన ఉద్దేశాలతో భద్రతా మండలి నడుస్తున్నది.
ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ప్రవేశించిన అన్ని దేశాలకు ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేండ్లకు ఒకసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందుతాయి. శాశ్వత సభ్యదేశాలకు మాత్రమే వీటో అధికారం ఉంటుంది. సమితి ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమైన రెండు మార్పులు చేసారు. ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్యదేశాలుండగా ఆ సంఖ్యను 10 కి పెంచారు. వీటిలో ఆసియా-ఆఫ్రికా దేశాల నుంచి ఐదుగురు, లాటిన్ అమెరికా దేశాల నుంచి ఇద్దరు, పశ్చిమ ఐరోపా నుంచి ఇద్దరు, తూర్పు ఐరోపా నుంచి ఒక్కరు ఎన్నికవుతుంటారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కారాదు. దీనికి అధ్యక్షుడు ప్రతి నెలా మారుతుంటారు. భద్రతా మండలి తన ఆదేశాలను పాటించని రాజ్యాలపై ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారముంది.
తాజావార్తలు
- రవితేజ 'హల్వా డాన్స్' అదిరింది..వీడియో
- మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి గంగుల
- హింస ఆమోదయోగ్యం కాదు: పంజాబ్ సీఎం
- భూ తగాదాలతో వ్యక్తి హత్య
- యాదాద్రిలో భక్తుల రద్దీ..
- పాత నోట్లపై కేంద్రం క్లారిటీ..!
- తిరుమలలో త్రివర్ణ పతాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో
- కాళేశ్వరం నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ
- అమర్నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు షురూ!
- రియల్మీ X7 సిరీస్ విడుదల తేదీ ఖరారు!