సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 13, 2020 , 00:27:36

కదనంలోకి కమల

కదనంలోకి కమల

ఆమె పదునైన విమర్శలకు ఎంతటి ప్రత్యర్థులైనా జడుసుకోవాల్సిందే.. ఆమె ప్రశ్న సంధించారంటే ఎదుటివ్యక్తి సమాధానం కోసం తడుముకోవాలి. అణిచివేత ఎక్కడుంటే ఆమె స్వరం అక్కడ గంభీరంగా వినిపిస్తుంది.. ధిక్కరిస్తుంది.. నిలదీస్తుంది.. ఆమె కమలాహారిస్‌.. అమెరికాలో పరిచయం అక్కరలేని ఉక్కుమహిళ. న్యాయవాదిగా అనేక రికార్డులు సృష్టించిన ఈ భారత సంతతి ధీరవనితకు.. రాజకీయ నేతగా కూడా ఎదురులేని రికార్డు ఉన్నది. అమెరికా సెనేట్‌కు ఎన్నికైన మొదటి భారత సంతతి, హిందూ మహిళగా నిలిచిన ఆమె.. తాజాగా డెమోక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి మహిళగా, భారత జాతీయురాలిగా.. తొలి హిందూ మహిళగా రికార్డు నెలకొల్పారు. డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఆమెను తన డిఫ్యూటీగా ఎంపికచేసి సంచలనానికి తెరలేపారు.

వాషింగ్టన్‌, ఆగస్టు 12: అమెరికాలో ఉక్కు మహిళగా పేరుగాంచిన భారత మూలాలున్న సెనేటర్‌ కమలాహారిస్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్‌ ఆమెను తన డిప్యూటీగా ఎంపికచేసి అధ్యక్ష ఎన్నికల్లో సంచలనానికి తెరలేపారు. అమెరికా ఎన్నికల చరిత్రలో ఒక ప్రధాన పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా నల్లజాతి మహిళ, అందునా భారత మూలాలున్న మహిళ ఎంపికవటం ఇదే తొలిసారి. 

ప్రత్యర్థే డిఫ్యూటీగా..

ఈ ఏడాది నవంబర్‌ 3న జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జో బిడెన్‌తో మొదట కమల పోటీపడ్డారు. 2019 చివరి వరకు పోటీలో ఉన్న ఆమె, ఆర్థిక వనరుల కొరతతో పోటీనుంచి విరమించుకొని బిడెన్‌కు మద్దతు ప్రకటించారు. దాంతో 77 ఏండ్ల బిడెన్‌ తన డిఫ్యూటీగా కమలను ఎంపిక చేసుకొన్నారు. 

నాకు గొప్ప గౌరవం

ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక కావటంపై కమలాహారిస్‌ సంతోషం వ్యక్తంచేశారు. జోబిడెన్‌ తనకు గొప్ప గౌరవం ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ‘అమెరికా ప్రజలను బిడెన్‌ మళ్లీ ఏకం చేస్తారు.  మనం మన ఆదర్శాల ప్రకారం జీవించేలా అధ్యక్షుడిగా బిడెన్‌ అమెరికాను తీర్చిదిద్దగలరు’అని ట్వీట్‌ చేశారు.

 ట్రంప్‌ ఆశలకు గండి..?

ప్రత్యర్థి జో బిడెన్‌ టీంలో కమలాహారిస్‌ చేరటంతో ట్రంప్‌ ఉలికిపాటుకు గురవుతున్నారు. మంగళవారం బిడెన్‌ ప్రకటన వెలువడిన నిమిషాల వ్యవధిలోనే కమలాహారిస్‌పై అసభ్యపదజాలంతో తిట్ల దండకం అందుకున్నారు. సెనేట్‌లో ఏమాత్రం మర్యాదలేని వ్యక్తి అని, అత్యంత నీచమైన, భయంకరమైన మహిళ అని నోరుపారేసుకున్నారు. ట్రంప్‌ ఉలికిపాటుకు బలమైన కారణమే ఉందంటున్నారు విశ్లేషకులు. అమెరికాలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది నల్లజాతీయులు ఆత్మగౌరవ పోరాటాలు చేస్తున్నారు. ఆఫ్రికన్‌ అమెరిన్లు, భారత జాతీయులు సంప్రదాయకంగా డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారులుగా ఉన్నారు. 

భారతీయుల ఓట్లపై గురి

బిడెన్‌ నిర్ణయంతో నల్లజాతీయులు, భారతీయుల ఓట్లన్నీ బిడెన్‌కు గంపగుత్తగా పడే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో 13 లక్షల మంది భారతజాతీయులు ఓటు వేస్తారని అంచనా. అధ్యక్ష గెలుపునకు అతికీలకమైన పెన్సిల్వేనియాలో 2లక్షలు, మిచిగాన్‌లో లక్షా 25వేల భారతీయుల ఓట్లు ఉన్నాయి. కమల రాకతో ఈ ఓట్లన్నీ బిడెన్‌ ఖాతాలోనే వెళ్లే అవకాశం ఉంది. బరాక్‌ ఒబామా కూడా కమలను పొగడ్తలతో ముంచెత్తటంతో ఆమె ప్రాభవం పెరిగింది. కమలకంటే ముందు 1984లో గెరాైల్డెన్‌ ఫెరారో, 2008లో సారా పాలిన్‌ ఉపాధ్యక్ష రేసులో నిలిచారు.

భారతీయులకు గర్వకారణం

కమలాహారిస్‌ను డెమోక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికచేయటంపై భారతీయ అమెరికన్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిణామం అమెరికాలోని భారతీయులందరికీ గర్వకారణమని పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రానూయీ అన్నారు. ఇది దేశానికి గొప్ప ఎంపిక అని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇప్పడే భారతీయ అమెరికన్లకు ప్రధాన సామాజికశ్రవంతిలో ప్రాధాన్యం లభించిందని ఇండియాస్పొరా వ్యవస్థాపకుడు ఎంఆర్‌ రంగస్వామి అన్నారు. కమలాహారిస్‌ను ఎంపికచేసుకున్న డెమోక్రటిక్‌ పార్టీకోసం 10 మిలియన్‌ డాలర్ల విరాళాలు సేకరిస్తామని అమెరికాలో భారతీయుల రాజకీయ హక్కుల సంస్థ ఇంపాక్ట్‌ ప్రకటించింది. 

 బాల్యంలో వివక్షకు గురైన హారిస్‌

కమలా హారిస్‌ - కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో అక్టోబర్‌ 20, 1964లో జన్మించారు. ఆమె తల్లి తమిళనాడుకు చెందిన శ్యామలా గోపాలన్‌. తండ్రి జమైకాకు చెందిన నల్లజాతీయుడు డొనాల్డ్‌ హారిస్‌. కమలకు ఏడేండ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. నల్లజాతీయులనే కారణంతో పొరుగింటి పిల్లలు కమలను దూరం పెట్టేవారు. కమల హోవర్డ్‌ వర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. 2010, 2014లో రెండుసార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేశారు. 

నంబర్‌ వన్‌.. కమల

  • నల్లజాతి ఉపాధ్యక్ష అభ్యర్థిగానేకాక కమల న్యాయవాదిగా, సెనేటర్‌గా రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు.1990లో కాలిఫోర్నియా అలెమెడా కౌంటీ డిఫ్యూటీ అటార్నీగా వృత్తిజీవితం ప్రారంభించారు. 
  • 2003లో శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ మొదటి మహిళ, మొదటి నల్లజాతి మహిళా అటార్నీగా రికార్డు. ఈ పదవి చేపట్టిన మొదటి భారతసంతతి మహిళ.
  • 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా బాధ్యతలు. ఈ పదవి చేపట్టిన మొదటి నల్లజాతి మహిళ కూడా కమలాయే. 
  • అమెరికా అత్యున్నత చట్టసభ సెనేట్‌కు ఎన్నికైన మొదటి భారతసంతతి మహిళ కమల. రెండో ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళగా రికార్డు. 
  • 2016లో కాలిఫోర్నియానుంచి సెనేట్‌కు ఎన్నికయ్యారు.


logo