గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 09, 2020 , 10:58:46

పాకిస్తాన్‌ విమానాలపై 188 దేశాల్లో నిషేధం?

పాకిస్తాన్‌ విమానాలపై 188 దేశాల్లో నిషేధం?

న్యూఢిల్లీ : పాకిస్తాన్ నుంచి నడుస్తున్న విమానయాన సంస్థలను 188 దేశాలలో ప్రయాణించడం నిషేధించే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) ప్రకారం పైలట్ లైసెన్స్ కుంభకోణం, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించకపోవడమే ఈ నిషేధానికి కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు పాకిస్తాన్ మీడియాల్లో  కూడా వచ్చినట్లు పలువురు నివేదిస్తున్నారు.

పాకిస్తాన్ వార్తాపత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపిన సమాచారం ప్రకారం.. లైసెన్స్ కుంభకోణం కారణంగా బ్రిటన్, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమానాలను నిషేధించాయి. ఈ ఏడాది ఆగస్టులో పాకిస్తాన్ విమానయాన మంత్రి 262 పైలట్లు నకిలీ పత్రాల ద్వారా లైసెన్సులు పొందారని వెల్లడించారు. ఇందులో 146 మంది పైలట్లు పీఐఏకు చెందినవారు కావడం విశేషం. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తరువాత, ఐసీఏఓ తన 12 వ సమావేశంలో 179 సెషన్‌లో తన సభ్య దేశాల ముఖ్యమైన భద్రతా సమస్యల (ఎస్‌ఎస్‌సీ) కోసం ఒక యంత్రాంగాన్ని ఆమోదించింది. అనంతరం భద్రత సమస్యపై పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (పీసీఏఏ) కు ఐసీఏఓ తీవ్రమైన హెచ్చరిక చేసింది. వ్యక్తిగత లైసెన్సింగ్, పైలట్ లైసెన్సింగ్ ప్రక్రియతో సంబంధమున్న అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణను అనుసరించడంలో పీసీఏఏ విఫలమైందని నవంబర్ 3 న పంపిన లేఖలో ఐసీఏఓ పేర్కొన్నది. ఈ కారణంగా పాకిస్తాన్‌కు చెందిన విమానాలతోపాటు ఆ దేశ పైలట్లను ప్రపంచంలోని 188 దేశాలలో ఎగరడాన్ని నిరోధించవచ్చు.

ప్రధాని దృష్టిపెట్టాలని వినతి

తమ దేశంపై నిషేధం విధించినట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ (పాల్పా) ప్రతినిధి హెచ్చరించారు. మా విమానాలను ఎగురడాన్ని నిరోధించినపక్షంలో అది పాకిస్తాన్ విమానయాన పరిశ్రమకు విపత్తులా ఉంటుందన్నారు. 2020 జూన్‌ నుంచి పాల్పా ఈ సమస్యను నిరంతరం లేవనెత్తుతున్నదని, అయితే దురదృష్టవశాత్తు సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదని ఆ ప్రతినిధి పేర్కొన్నారు. ఇదే సమయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అసోసియేషన్ అభ్యర్థించింది. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకొని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని అసోసియేషన్ ప్రధానిని కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.