ఆదివారం 29 నవంబర్ 2020
International - Oct 23, 2020 , 21:10:52

కడుపు నింపుకునేందుకు డ్రైనేజీవైపు చూస్తున్నారు..!

కడుపు నింపుకునేందుకు డ్రైనేజీవైపు చూస్తున్నారు..!

యాంగోన్‌: ‘ప్రతి పురుగునూ కదిలించే నిజం ఒక్కటే ఆకలి..’ అని తెలుగు సినిమాలో సాయికుమార్‌ చెప్పిన డైలాగ్‌ గుర్తుందా..ఆకలి మనతో ఏ పనైనా చేయిస్తుంది. బతికి ఉండాలంటే ఏదో ఒకటి తినాలి.. మరి తినేందుకు ఏం దొరకనప్పుడు..? అందుకే మయన్మార్‌లోని స్లమ్‌ ఏరియా ప్రజలు తమ కడుపు నింపుకునేందుకు డ్రైనేజీ వైపు చూస్తున్నారు. రాత్రిపూట మురుగు కాలువల్లో దొరికే ఎలుకలు, పాములను తింటూ ప్రాణాలు కాపాడుకుంటున్నారట. 

కరోనా వైరస్‌ మొదటి వేవ్‌ మార్చిలో ప్రారంభమైనప్పుడు మాసు(36)అనే మహిళ సలాడ్‌ స్టాల్‌ మూతపడింది. దీంతో బతుకు భారమైంది. తనతోపాటు తన కుటుంబ సభ్యుల కడుపునింపేందుకు ఇంట్లో ఉన్న నగలు, బంగారాన్ని తాకట్టు పెట్టింది. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో (సెప్టెంబర్‌) యాంగోన్‌లో స్టేహోమ్‌ ఆర్డర్‌ జారీ అయ్యింది. అప్పుడు కూడా మాసు తన దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. అప్పుడు తిండికోసం బట్టలు, ప్లేట్లు, కుండలను అమ్మేసింది. ఇక వారి దగ్గర ఇప్పుడు అమ్మేందుకు ఏమీ లేవు. అందుకే మాసు, తన భర్తతో కలిసి మయన్మార్‌ నగర శివారులోని మురికివాడల్లోగల డ్రైనేజీల్లో ఎలుకలు, పాముల కోసం వేటకు వెళ్తున్నారు.  

ఇది ఒక్క మాసు కుటుంబం పడుతున్న బాధకాదు.. మయన్మార్‌ దేశం మొత్తం ఆకలితో అలమటిస్తోంది. మయన్మార్‌లో 40,000 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. వెయ్యి మరణాలతో మయన్మార్ ఆగ్నేయాసియాలో అత్యంత ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కొంటోంది. యాంగోన్‌లో లాక్‌డౌన్‌ వల్ల వేలాది మంది జీవితాలు రోడ్డునపడ్డాయి. దీనిపై అధికార పార్టీ శాసనసభ్యుడు మయాట్‌ మిన్‌థు మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సహాయంతోపాటు ప్రైవేట్‌ విరాళాలు అందజేస్తున్నాం..కానీ ప్రతి ఒక్కరినీ కవర్‌ చేయలేకపోతున్నామని అంగీకరించారు. ఇదిలా ఉంటే, నవంబర్ 8న జరుగబోయే సార్వత్రిక ఎన్నికలపై ఈ సంక్షోభం ప్రభావం చూపనుంది. అయినా నోబెల్‌ గ్రహీత ఆంగ్‌సాన్‌సూకీ విజయం సాధిస్తారని భావిస్తున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.