బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 26, 2020 , 18:43:10

జో బిడెన్.. తొందరపడి ఓటమిని ఒప్పుకోకూడదు: హిల్లరీ క్లింటన్

జో బిడెన్.. తొందరపడి ఓటమిని ఒప్పుకోకూడదు: హిల్లరీ క్లింటన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీ చేస్తున్న డెమోక్రాటిక్ పార్టీకి చెందిన బో బిడెన్ తొందరపడి ఓటమిని ఒప్పుకోకూడదని ఆ పార్టీకి చెందిన హిల్లరీ క్లింటన్ తెలిపారు. కరోనా నేపథ్యంలో మెయిల్ ద్వారా పోలయ్యే ఓట్లు చేరేందుకు చాలా సమయం పడుతుందని, దీంతో బ్యాలెట్ల ఓటింగ్ కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశమున్నదని ఆమె అన్నారు. దీంతో ఫలితాలు వెల్లడి పూర్తయ్యేంత వరకు జో బిడెన్ ఓటమిని చివరి వరకు ఒప్పుకోకూడదని హిల్లరీ క్లింటన్ చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలుస్తారన్న నమ్మకం తనకు ఉన్నదని అన్నారు. దీని కోసం మనం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని, అవతలి పక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని పార్టీ నేతలకు సూచించారు.

రిపబ్లిక్ పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్ల చేరికపై గందరగోళం సృష్టించి చివర్లో కొద్ది మెజార్టీతో గెలిచేందుకు ప్రయత్నిస్తారని హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో డెమెక్రాటిక్ పార్టీ ఈసారి దీనిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె అన్నారు. దీనిపై చట్టబద్ధమైన ఆపరేషన్‌కు పిలుపునిచ్చారు. నవంబర్ 3 నాటికి ఫూర్తి ఫలితం తేలదని పరోక్షంగా ఇరు పార్టీలకు హెచ్చరించారు. ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ సందర్భంగా హిల్లరీ క్లింటన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ట్రంప్‌పై 30 లక్షలకుపైగా ఓట్లు సాధించినప్పటికీ రాష్ట్రాలవారీ ఎలక్టోరల్ కాలేజీ కౌంట్‌లో హిల్లరీ వెనుకబడిపోయారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo