సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 02:30:43

టిక్‌టాక్‌ బంద్‌

టిక్‌టాక్‌ బంద్‌

  • l యాప్‌పై ట్రంప్‌ నిషేధం
  • l వియ్‌చాట్‌పైనా బ్యాన్‌
  • l 45 రోజుల్లోగా అమల్లోకి

వాషింగ్టన్‌, ఆగస్టు 7: చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం విధించింది. దానితోపాటు మరో చైనీస్‌ యాప్‌ వియ్‌చాట్‌ను కూడా బ్యాన్‌ చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కార్య నిర్వాహక ఆదేశాలు జారీచేశారు. 45 రోజుల్లోగా ఈ నిషేధం అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ యాప్‌ల వల్ల జాతీయ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. భారత్‌, ఆస్ట్రేలియా కూడా చైనా యాప్‌లపై నిషేధం విధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జాతీయ భద్రతను పరిరక్షించుకునేందుకు టిక్‌టాక్‌ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. టిక్‌టాక్‌కు అమెరికాలో దాదాపు 80 లక్షల మంది యాక్టివ్‌యూజర్లు ఉన్నారు. చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు చెందిన ఈ యాప్‌.. యూజర్ల సమాచారాన్ని సేకరిస్తున్నదని ట్రంప్‌ ఆరోపించారు. దీని ద్వారా అమెరికన్ల వ్యక్తిగత సమాచారం చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ చేతుల్లోకిచేరే ప్రమాదం ఉన్నదని చెప్పారు. అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల లొకేషన్‌ను ట్రాక్‌ చేసేందుకు, బ్లాక్‌మెయిల్‌, కార్పొరేట్‌ గూఢచర్యానికి పాల్పడేందుకు ఈ సమాచారాన్ని చైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. 

టిక్‌టాక్‌లో చైనా అనుకూల ప్రచారం

వీగర్‌ ముస్లింల పట్ల చైనా ప్రభుత్వ అరాచకాలు, హాంకాంగ్‌ నిరసనలకు సంబంధించిన సమాచారాన్ని టిక్‌టాక్‌ సెన్సార్‌ చేస్తున్నదని ఆరోపించారు. చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ యాప్‌లపై చర్యలు చేపట్టినట్లు కాంగ్రెస్‌కు సమాచారమిచ్చారు. ఔషధాలు, ఇతర వైద్య అవసరాలు చైనా, తదితర దేశాలపై ఆధారపడే దుస్థితికి అమెరికా ఇక స్వస్తి పలుకుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు.


logo