సోమవారం 06 జూలై 2020
International - Jun 27, 2020 , 00:43:24

సరికొత్త మాస్కు వచ్చేసింది...

సరికొత్త మాస్కు వచ్చేసింది...

టోక్యో: జపాన్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యే ‘స్మార్ట్‌ మాస్కు’ను తయారు చేసింది. మహమ్మారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కు ధరించడం తప్పనిసరి కావడంతో స్మార్ట్‌ మాస్కును రూపొందించినట్టు డోనట్‌ రోబోటిక్స్‌ సీఈఓ తైసుకే ఓనో తెలిపారు. రోబో తయారీకి కృషి చేశామని, ఆ టెక్నాలజీ సాయంతోనే దీన్ని తయారు చేశామని చెప్పారు. తెల్లని ప్లాస్టిక్‌తో తయారైన స్మార్ట్‌ మాస్కును సీ-మాస్కుగా వ్యవహరిస్తామని అన్నారు. ఇది బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌ యాప్‌తో కనెక్ట్‌ అవుతుందని తైసుకే తెలిపారు. సీ-మాస్కు ద్వారా మన ఆదేశాలతో మొబైల్‌ యాప్‌ మెసేజ్‌లు పంపడం, కాల్స్‌ చేయడం, మాటల్ని టెక్స్ట్‌ రూపంలోకి మార్చుతుందని అన్నారు. మాస్కు ధరించిన వ్యక్తి చిన్నగా మాట్లాడినా దానిని శబ్ద తీవ్రతను యాప్‌ అధికం చేస్తుందన్నారు. జపాన్‌ భాష నుంచి 8 ఇతర భాషల్లోకి సీ-మాస్కు ద్వారా యాప్ పదాల్ని‌ తర్జుమా చేస్తుందని అన్నారు.  సీ-మాస్కు ధర రూ.3 వేలు. ఒక నాణ్యమైన మాస్కుపైన సీ-మాస్కు అమర్చబడి ఉంటుందని తైసుకే తెలిపారు. జపాన్‌ మార్కెట్లోకి వచ్చే సెప్టెంబర్‌ నాటికి 5000 యూనిట్లు పంపిస్తామని అన్నారు. అమెరికా, చైనా, యూరప్‌లలో వీటిని ఆదరిస్తారనే నమ్మకముందన్నారు.


logo