గురువారం 04 జూన్ 2020
International - Apr 26, 2020 , 13:52:00

పేరుకే ప్ర‌ధాని.. పాల‌నంతా సైన్యానిదే

పేరుకే ప్ర‌ధాని.. పాల‌నంతా సైన్యానిదే

పాకిస్థాన్‌లో సైన్యం ఎంత శ‌క్తిమంత‌మైన‌దో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రంలేదు. అక్క‌డ ఎవ‌రు అధికారంలోకి రావాలి, ఎవ‌రు ప్ర‌తిప‌క్షంలో ఉండాల‌న్న‌ది కూడా సైన్యమే నిర్ణ‌యిస్తుంది. తాజాగా క‌రోనా వైరస్ విష‌యంలో దేశంలో సైన్యం ఎంత శ‌క్తిమంత‌మైన‌దో మ‌రోసారి రుజువ‌య్యింది. ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌ను పూచిక‌పుల్ల‌లా తీసివేస్తూ సైన్య‌మే అన్ని ఆదేశాలూ ఇస్తున్న‌ది. నిజానికి ఇమ్రాన్ కూడా 2018 ఎన్నిక‌ల్లో సైన్యం వ‌ల్ల‌నే అధికారంలోకి వ‌చ్చారు. 

తాజాగా క‌రోనాను క‌ట్ట‌డి చేసే విష‌యంలో దేశంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించాలా వ‌ద్దా అన్న‌దానిపై ఇమ్రాన్‌ను సైన్యం అవ‌మాన‌ప‌ర్చ‌గా ఇప్పుడు మ‌రోసారి అదే ప‌ని జ‌రిగింది. మార్చి 22న ఇమ్రాన్ దేశ‌ప్ర‌జ‌ల‌నుద్దేశించి టెలివిజ‌న్‌లో మాట్లాడుతూ క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు దేశంలో లాక్‌డౌన్ విధిస్తే క‌రోనా మృతుల‌కంటే ఆక‌లితో చ‌నిపోయేవాళ్లే ఎక్కువ ఉంటార‌ని పేర్కొన్నారు. అందువ‌ల్ల లాక్‌డౌన్ సాధ్యంకాద‌ని స్ప‌ష్టంచేశారు. కానీ 24 గంట‌లు గ‌డువ‌క‌ముందే దేశంలో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు సైనిక ప్ర‌తినిధి మేజ‌ర్ జ‌న‌ర‌ల్ బాబ‌ర్ ఇఫ్‌తికార్ ప్ర‌క‌టించ‌టంతో పాకిస్థానీల‌తోపాటు ప్ర‌పంచం కూడా ఆశ్చ‌ర్య‌పోయింది. 

క‌రోనా నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం సాధించ‌టానికి ప్ర‌భుత్వం నేష‌న‌ల్ కోర్ క‌మిటీ అనే ఓ క‌మిటీని కొద్దిరోజుల క్రితం ఏర్పాటుచేసింది. అయినా అది ప్రభుత్వాల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌లేక‌పోతున్న‌ది. పాకిస్థాన్‌లో ఇప్ప‌టికే క‌రోనా కేసులు 12500దాటింది. దాంతో ఈ కోర్‌క‌మిటీని తామే నిర్వ‌హిస్తామ‌ని ఆదివారం రిటైర్డ్ సైనిక అధికారి ఒక‌రు ప్ర‌క‌టించ‌టం సంచ‌ల‌నంగా మారింది. పౌర ప్ర‌భుత్వంకంటే ‌తామే ప్ర‌జ‌ల‌కు ఉత్త‌మంగా సేవ‌లు అందించ‌గ‌ల‌మ‌ని చెప్పేందుకు సైన్యం క‌రోనా సంక్షోభాన్ని ఉప‌యోగించుకుంటున్న‌ద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 


logo