బుధవారం 03 జూన్ 2020
International - Apr 21, 2020 , 22:02:29

కరోనా విపత్తు వేళ దక్షిణాఫ్రికాలో తెలుగు ప్రజల మానవత

కరోనా విపత్తు వేళ దక్షిణాఫ్రికాలో తెలుగు ప్రజల మానవత

హైదరాబాద్‌ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరించిన విషయం తెలిసిందే. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. లాక్‌డౌన్‌ విధింపుతో సకలం బంద్‌ అయ్యాయి. నిరుపేదలు, వలస కూలీలు రోజువారీ జీవనానికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటే దుస్థితే దక్షిణాఫ్రికాలో నెలకొంది. జింబాబ్వే, జాంబియా, మలావి వంటి పేద దేశాల నుండి ఎంతోమంది వలస కార్మికులు పొట్టచేతపట్టుకుని దక్షిణాఫ్రికాకు వలసొచ్చారు. ప్రస్తుత కాలంలో వీరందరి జీవనం దయనీయంగా మారింది. ఈ పరిస్థితులను చూసిన స్థానిక తెలుగు ప్రజలంతా ఒక్కటై గొప్ప మానవతా థృక్పథాన్ని చాటుతూ సహాయం అందించారు. తమకు చేతనైనంతలో చేయూత అందించడానికి ముందుకొచ్చారు. 

జోహన్నెస్‌బర్గ్‌ చుట్టుప్రక్కల ఉన్న థెంబీసా, ఐవరీ పార్క్‌, డిప్స్లూట్‌, మూయిప్లాస్‌ తదితర ప్రాంతాల్లోని దాదాపు వెయ్యి కుటుంబాలకు 4-5 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. రెండు వేల సంచులను ప్యాక్‌ చేయడంలోనూ అన్ని ప్రాంతాల్లో అందించడంలోనూ చర్చ్‌ ఆఫ్‌ సెయింటాలజీ సభ్యులు చేసిన సహాయం మరువలేదని నిర్వాహకులు అన్నారు. తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ సౌతాఫ్రికా, ఆంధ్ర అసోసియేషన్‌ ఆఫ్‌ సౌతాఫ్రికా, ఇండియా కేర్స్‌, సౌత్‌ ఆఫ్రికన్‌ హిందూ సేవా సమితి, శ్రీ సాయి దర్శన్‌ చారిటబుల్‌ ఆర్గనైజేషన్‌, సౌతాఫ్రికా తెలుగు కమ్యూనిటీ, టీఆర్‌ఎస్‌ సౌతాఫ్రికా శాఖ, జోహన్నెస్‌బర్గ్‌ ఇండియన్‌ విమెన్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఈ నిత్యావసర సరుకులను అందజేశారు. 


logo