శనివారం 30 మే 2020
International - Apr 21, 2020 , 12:47:30

కరోనా మంటలతో చలికాచుకుంటున్న చైనా

 కరోనా మంటలతో చలికాచుకుంటున్న చైనా

కోవిడ్‌-19 వైరస్‌ పుట్టుకకు కారణమైన చైనా ప్రపంచం అనుమానించినట్లుగానే చాపకింద నీరులా తన ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నది. కరోనాను కట్టడి చేయలేక ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయి. వ్యాపారాలన్నీ మూతపడి కంపెనీలన్నీ దివాళా తీస్తున్నాయి. ఇదే సమయంలో చైనా కంపెనీలు ఒక్కో కంపెనీనీ చడీచప్పుడు లేకుండా హస్తగతం చేసుకుంటుండటంతో అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. భారత్‌ కూడా చైనా ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని నిలువరించేందుకు ఎఫ్‌డీఐల విషయంలో నిబంధనలు కఠినతరం చేసింది. భారత్‌కంటే ముందే చాలా దేశాలు చైనా ఎత్తుగడలను గుర్తించి జాగ్రత్తపడ్డాయి.

చైనా కుతంత్రాన్ని ముందుగా గుర్తించినది యూరోపియన్‌ యూనియన్‌. చైనా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బడా సంస్థలు యూరప్‌లోని పలు కీలక రంగాల్లో ఉన్న పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెట్టడాన్ని ఈయూ నేతలు ముందుగా అనుమానించారు. వెంటనే జాగ్రత్తపడి మార్చి 25న విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించారు. కరోనా సంక్షోభంతో దివాళా అంచున ఉన్న కంపెనీలను అతితక్కువ మొత్తానికి చైనా కంపెనీలు ఆక్రమించుకోవటాన్ని అడ్డుకున్నారు. ఎఫ్‌డీఐలను ప్రభుత్వాలు పరిశీలించిన తర్వాత అనుమతులు ఇవ్వాలని సభ్యదేశాలకు ఈయూ సూచించింది. దాంతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాలు చైనా పెట్టుబడులపై కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఈ దేశాలన్నీ కరోనాతో సతమతమవుతుండటం గమనార్హం.  ఆస్ట్రేలియా కూడా మార్చి 30 నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై నిబంధనలు కఠినం చేసింది. దాంతో ఆ దేశంలోని విమానయాన, మెడికల్‌ కంపెనీలు చైనా కంపెనీల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నది.

ఈ ఏడాది 18న కెనడా కూడా ఇదే విధమైన ఆంక్షలు విధించింది. దేశంలోని ఏ కంపెనీలోకి వచ్చే ఎఫ్‌డీఐ ఐయినా ప్రభుత్వం పరిశీలించి అనుమతి ఇస్తేనే ఆచరణలోకి వస్తుందని స్పష్టంచేసింది. కంప్యూటర్‌, మిలిటరీ, క్వాంటమ్‌ టెక్నాలజీ తదితర రంగాల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఇటీవలే ఈయూ నుంచి బయటకు వచ్చిన బ్రిటన్‌ కూడా గట్టి ఆదేశాలిచ్చింది. ఇక అగ్ర రాజ్యం అమెరికా కూడా ఇదేవిధమైన చర్యలు చేపట్టింది. అమెరికా విదేశీ పెట్టుబడుల కమిటీ (సీఎఫ్‌ఐయూఎస్‌) ఎఫ్‌డీఐలు తమ దేశభద్రతకు భంగం కలిగించే అవకాశం ఏమైనా ఉందా అన్నదానిపై తీక్షణంగా పరిశీలిస్తున్నది.

ఈ దేశాల బాటలోనే ఇండియా కూడా నడిచింది. ఈ నెల 17న తనతో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కచ్చితంగా ప్రభుత్వ పరిశీలన అనంతరమే అమల్లోకి వచ్చేలా నిబంధనలు కఠినం చేసింది. నిజానికి గతంలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకు మాత్రమే ఈ నిబంధన ఉండేది. తాజాగా చైనా, నేపాల్‌, భూటాన్‌, బర్మా, శ్రీలంకలకు కూడా ఈ నిబంధనలను వర్తింపజేసింది. దేశంలో అతిపెద్ద నాన్‌బ్యాంకింగ్‌ మార్ట్‌గేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీలో చైనా జాతీయ బ్యాంకు పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా తన వాటాను 0.8 నుంచి 1.01శాతానికి పెంచుకోవటంతో భారత ప్రభుత్వం ప్రమాదాన్ని శంకించి ఆంక్షలు విధించింది.  


logo