గురువారం 04 జూన్ 2020
International - Apr 20, 2020 , 08:44:25

ప్యారిస్లో ప్రమాదఘంటికలు

ప్యారిస్లో ప్రమాదఘంటికలు

కోవిడ్‌-19 వైరస్‌ ఇందుగలదు అందులేదు అనే అవకాశం లేకుండా ఎందెందు చూచినా బయటపడుతున్నది. కూరగాయలు, పాలప్యాకెట్లపై సైతం కోవిడ్‌ వైరస్‌ కొంతకాలం బతుకుతుందని అందరికీ తెలిసిందే. తాజాగా నీళ్లలో కూడా కరోనా వైరస్‌ బయటపడటం ఆందోళన కలిగిస్తున్నది. ప్యారిస్‌లో రోడ్లు శుభ్రం చేసేందుకు ఉపయోగించే నీళ్లలో కోవిడ్‌-19 వైరస్‌ను గుర్తించారు. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ప్యారిస్‌ నగర వ్యాప్తంగా సేకరించిన 27శాంపిల్స్‌ను అక్కడి వాటర్‌ అథారిటీ ల్యాబ్‌లో పరీక్షించగా నాలుగు నమూనాల్లో కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఆ నీటి నెట్‌వర్క్‌ను మెత్తం వెంటనే మూసివేసినట్లు సెలియా బ్లాయెల్‌ అనే అధికారి తెలిపారు. అయితే నగరంలో తాగునీరు అందించే నెట్‌వర్క్‌ వేరేగా ఉండటంతో ఆ నీటిలో కోవిడ్‌-19 లేదని వెల్లడించారు. నగరంలో సరఫరా అయ్యే తాగునీరు ఎలాంటి సందేహం లేకుండా వాడుకోవచ్చని భరోసా ఇచ్చారు. ప్యారిస్‌ నగరంలో రోడ్లు శుభ్రం చేయటానికి, పార్కులకు సీనీ నది నుంచి ఓర్క్‌ కాలువద్వారా నీటిని సరఫరా చేస్తారు. ఈ నీటిలోనే కోవిడ్‌-19 వైరస్‌ను గుర్తించారు.


logo